మరోసారి మోదీనే ప్రధాని అవుతారని దావోస్ వేదికగా చంద్రబాబు వ్యాఖ్యలు చేసారు.
దావోస్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు, కుటుంబం, వ్యాపారం వంటి రంగాల్లో వారసత్వం అనేది ఒక మిథ్య అని ఆయన వ్యాఖ్యానించారు. నారా లోకేశ్ రాజకీయాల్లోకి రావడంలో వారసత్వం ప్రభావం లేదని స్పష్టం చేశారు.
లోకేశ్‌కు రాజకీయాలు కేవలం ఎంపికే కాదు..
ఓ మీడియా ప్రతినిధి నారా లోకేశ్ వారసత్వంపై అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిస్తూ, లోకేశ్ తన శక్తి సామర్థ్యాల ద్వారా రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. జీవనోపాధి కోసం తాను రాజకీయాలపై ఆధారపడలేదని, కుటుంబ వ్యాపారాలను 33 ఏళ్ల క్రితమే ప్రారంభించానని తెలిపారు. కావాలనుకుంటే లోకేష్ కు వ్యాపారం నల్లేరుపై నడకలాంటిదని, కానీ ప్రజా సేవను లోకేశ్ లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకే ఆయన రాజకీయాల్లో రాణిస్తున్నారని చెప్పారు.
జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తే ఏమవుతుందనే ప్రశ్నకు చంద్రబాబు ఘాటుగా స్పందించారు. మోసం ద్వారా ఒకసారి అధికారంలోకి రావచ్చు కానీ, ప్రతిసారి రాలేరని అన్నారు. రాజకీయాల్లోనూ, వ్యక్తిగత జీవితాల్లోనూ విలువల ప్రాధాన్యత గురించి ఆయన హితవు పలికారు.
గుజరాత్ విజయాలతో దేశాభివృద్ధి
గుజరాత్‌లో బీజేపీ వరుసగా ఐదోసారి అధికారంలోకి రావడాన్ని చంద్రబాబు ప్రశంసించారు. అక్కడ అభివృద్ధి, సంక్షేమం అద్భుతంగా కొనసాగుతుందని చెప్పారు. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి విజయం సాధించారని, నాలుగోసారి కూడా ఆయనే ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి పదవిపై స్పందన
కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అదానీ కాంట్రాక్టులపై వస్తున్న విమర్శలపై ఆయన మాట్లాడుతూ, ఆ వ్యవహారం అమెరికా కోర్టులో పెండింగ్‌లో ఉందని, నిర్ధిష్ట సమాచారం అందిన తర్వాతనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
వనరుల దుర్వినియోగంపై హెచ్చరిక
రాజకీయాల్లోనూ, వ్యాపారాల్లోనూ వనరులను దుర్వినియోగం చేస్తే అది దేశ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పారదర్శకతను పాటించాలని ఆయన సూచించారు.