ముంబై: రంజీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ బౌలర్ ఉమర్ నజీర్ మిర్ తన అద్భుత ప్రదర్శనతో ముంబయి స్టార్ బ్యాటర్లను తికమక పెట్టాడు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫామ్‌ను పునరుద్ధరించేందుకు ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగినప్పటికీ, కేవలం 3 పరుగులకే అవుటయ్యాడు.
రోహిత్‌తో పాటు ముంబయి కెప్టెన్ అజింక్య రహానే, హార్దిక్ తమోర్, శివమ్ దూబేలను కూడా ఉమర్ నజీర్ తన చక్కని బౌలింగ్‌తో పెవిలియన్‌కు పంపాడు.
తన పొడవు (6 అడుగుల 4 అంగుళాలు) అందించిన సహాయంతో, ఉమర్ వేగంతో పాటు బౌన్స్‌కి ఆధిపత్యం చాటాడు. రోహిత్‌ను షార్ట్ పిచ్ బంతితో ఔట్ చేయడం మొదలుకొని, హార్దిక్ తమోర్, అజింక్య రహానే, శివమ్ దూబేలను అతడు చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బెంబేలెత్తించాడు.
ముఖ్యంగా, శివమ్ దూబేను తొలి బంతికే క్లీన్ బౌల్డ్ చేయడం హైలైట్‌గా నిలిచింది. ఉమర్ నజీర్ ఇప్పటివరకు 57 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 138 వికెట్లు సాధించాడు.
2013లో మొదలైన తన కెరీర్లో అతడు జమ్మూ కాశ్మీర్ తరఫున కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2018-19 దేవధర్ ట్రోఫీలో భారత్-సీ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, భారత జట్టులో అడుగుపెట్టడానికి మాత్రం విఫలమయ్యాడు.
తాజాగా, ముంబయి బ్యాటర్లను కకావికలం చేసిన ఉమర్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.