ఏపీలో పేదలకు త్వరలో ఇళ్ల స్థలాల పంపిణీ
విజయవాడ: ఏపీలో పేదలకు త్వరలో ఇళ్ల స్థలాల పంపిణీ
రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, అర్హులందరికీ ఇళ్లు అందించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక ప్రకటనలు చేశారు.
గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1.14 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు మంత్రి వివరించారు. తణుకు మండలం తేతలిలో ఫిబ్రవరి 1న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ జరగనున్నట్లు వెల్లడించారు.
‘‘గత ఆరు నెలల్లో గృహనిర్మాణం కోసం రూ.502 కోట్లను ఖర్చు చేశాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదలకు ఇళ్లు అందించడంలో ఎలాంటి తగ్గు మందల లేదు’’ అని మంత్రి పేర్కొన్నారు. పీఎంఏవై (ప్రధానమంత్రి ఆవాస్ యోజన) కింద మార్చి వరకు 7 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ద్వితీయ దశలో 6 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ పేదలకు 3 సెంట్ల స్థలాలు, పట్టణ పేదలకు 2 సెంట్ల స్థలాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం త్వరలో విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు ప్రకటించారు.
వైసీపీ పార్టీకి విజయసాయికి రాజీనామా చేసిన అంశంతో సంబంధం లేదని స్పష్టతనిచ్చారు. ‘‘వైకాపా త్వరలో ఖాళీ అవుతుంది’’ అని పేర్కొంటూ పార్థసారథి తన మాటలను ముగించారు.