తెలంగాణ: తెలంగాణలో కిడ్నీ రాకెట్ కేసు సీఐడీకి అప్పగింపు
సరూర్‌నగర్ అలకనంద ఆసుపత్రిలో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు సీఐడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించి పనిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
కిడ్నీ రాకెట్‌పై ప్రాథమిక దర్యాప్తును వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని డాక్టర్ నాగేందర్ నేతృత్వంలో చేపట్టగా, తక్షణమే ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ నివేదిక ఆధారంగా సీఐడీ మరింత లోతుగా విచారణ ప్రారంభించనుంది. ప్రభుత్వ అనుమతులు అతిక్రమించి అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి వంటి అక్రమ కార్యకలాపాలు ఎలా జరిగాయనే దానిపై విచారణ జరుగుతోంది.
మూడురాష్ట్రాల అనుసంధానం
ఈ రాకెట్ తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతోనూ ముడిపడి ఉందని తెలుస్తోంది. కేవలం 9 పడకల అనుమతితో పని చేయాల్సిన ఈ ఆసుపత్రి, 30 పడకల ఏర్పాటుతో నాలుగంతస్తుల్లో ఈ దందాను నడిపినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా, తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలను కిడ్నీ దాతలుగా ఒప్పించి, హైదరాబాద్‌కు రప్పించి, వారి కిడ్నీలు మార్చి కర్ణాటకకు చెందిన గ్రహీతలకు అమర్చినట్లు తేలింది.
పోలీసుల దాడులు, కీలక ఆధారాలు
డీసీపీ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆసుపత్రిపై జరిగిన దాడుల్లో వైద్యులు, సిబ్బంది అక్కడి నుంచి పారిపోయారు. కిడ్నీ మార్పిడి ఘటనలలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు దాతలను, ఇద్దరు గ్రహీతలను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాతల వివరాలు ఇంకా పొంతనలేని విధంగా ఉండగా, కిడ్నీ మార్పిడి జరిగిందని వైద్య పరీక్షల్లో తేలింది.
కీలక సమాచారం
కిడ్నీ రాకెట్ పై సమాచారం అందించిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అతనిని పట్టుకుంటే కేసులో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది. గతంలో హైదరాబాద్ నుంచి శ్రీలంక, ఇరాన్‌లకు కిడ్నీ దాతలను తరలించిన ఘటనలు కూడా వెలుగుచూశాయి.
ఆసుపత్రుల అనుమతుల విచారణ
రాష్ట్రంలో కిడ్నీ మార్పిడి కోసం ప్రభుత్వ అనుమతులు పొందిన 41 ఆసుపత్రుల్లో మాత్రమే ఇది చట్టబద్ధంగా జరుగుతుంది. అయితే అలకనంద ఆసుపత్రి ఈ నిబంధనలను విస్మరించి అక్రమ మార్గాల్లో కిడ్నీ మార్పిడి చేయడం సంచలనం రేపుతోంది.
సీఐడీ దర్యాప్తు ప్రారంభం
సీఐడీ విచారణతో అసలు దందాలోని అసలు నాయుకులు, వారి ముఠా పనిచేసిన విధానం, ఇందులో నడిచిన నగదు లావాదేవీలు తదితర అంశాలు బయటపడే అవకాశం ఉంది. ఈ దందా వెనుక ఉన్న చెయ్యి తిరిగిన వైద్యులు, సౌకర్యాల లేమి ఉన్నప్పటికీ ఈ ఆపరేషన్లు ఎలా జరిగాయన్న దానిపై విచారణ కొనసాగుతోంది.
కిడ్నీ డిమాండ్ vs అవయవ దాతలు
ప్రస్తుతం అవయవాల లభ్యత తగ్గిపోవడం, డిమాండ్ అధికం కావడంతో ఇలాంటి అక్రమ మార్పిడులు జరుగుతున్నాయి. జీవన్‌దాన్ ట్రస్టు ద్వారా ఇప్పటి వరకు 15,722 మంది దాతలు నమోదు చేసుకోగా, కిడ్నీ కోసం 7,667 మంది నిరీక్షిస్తున్నారు.