జాతీయం: కుంభమేళాలో తీవ్ర విషాదం: తొక్కిసలాటలో 17 మంది మృతి
ప్రపంచ ప్రఖ్యాత కుంభమేళాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య పుణ్యస్నానాల సందర్భంగా త్రివేణి సంగమం వద్ద జరిగిన తొక్కిసలాటలో 17 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 40 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
మౌని అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానం కోసం త్రివేణి సంగమం వద్దకు చేరుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా ప్రవేశించడంతో భద్రతా బారికేడ్లు విరిగిపోయాయి. గందరగోళం చోటుచేసుకుని భక్తులు ఒకరి మీద ఒకరు పడిపోవడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది.
దీంతో పలువురు అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన వారిని స్థానిక అధికారులు వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. హఠాత్తుగా చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో యాత్రికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జాతీయ మీడియాలో వచ్చిన సమాచారం మేరకు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. అయితే, ఈ సమాచారంపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.
తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
కుంభమేళా ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. భారీ జన సమూహం తరలివచ్చే సమయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, భద్రతా నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని సూచనలు జారీ అయ్యాయి.