జాతీయం: ఇస్రో శత విజయవిజ్రంభణం
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తన ప్రస్థానంలో మరో చరిత్రాత్మక ఘట్టాన్ని అందుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్15 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది.
ఈ ప్రయోగం ద్వారా నావిగేషన్ విభాగంలో కీలకమైన ఎన్‌వీఎస్-02 ఉపగ్రహంని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 2,250 కిలోల బరువు కలిగిన ఈ శాటిలైట్, స్వదేశీ నావిగేషన్ వ్యవస్థలో కీలక భాగంగా మారనుంది. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవలతో పాటు, వ్యవసాయ సాంకేతికత, విమానయాన రంగం, మొబైల్ పరికరాల్లో లోకేషన్ ఆధారిత సేవలను మెరుగుపరచనుంది.
ఇది ఇస్రో నిర్వహించిన వందో ప్రయోగం కావడం విశేషం. 1979లో అబ్దుల్ కలాం నేతృత్వంలో మొదటి ప్రయోగం చేపట్టినప్పటి నుంచి, ఇప్పటి వరకు 548 శాటిలైట్లను కక్ష్యలోకి పంపించింది. ఈ ప్రయాణంలో మూడు చంద్రయాన్ మిషన్లు, మార్స్ ఆర్బిటర్ మిషన్ (MOM), ఆదిత్య ఎల్1, స్పేస్ రిటర్న్ ఎక్స్‌పెరిమెంట్ (SRE) వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చోటు చేసుకున్నాయి.
ఈ విజయంతో ఇస్రో నూతన అధిపతి వి. నారాయణన్‌కు తొలి ప్రయోగ విజయంగా నిలిచింది. ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలను పర్యవేక్షించారు. ఎన్‌వీఎస్-02 ఉపగ్రహం కనీసం పదేళ్ల పాటు సేవలందించనుంది.
ఈ ప్రయోగ విజయాన్ని పురస్కరించుకుని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ, ఇది ఇస్రో ప్రయాణంలో మరో మైలురాయి అని అభివర్ణించారు. విక్రమ్ సారాభాయ్ హయాంలో మొదలైన ఇస్రో ప్రయాణం, అద్భుత విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్టు ఇస్రో ప్రకటించింది. ప్రస్తుత విజయంతో భారత అంతరిక్ష ప్రయోగాల్లో మరో భారీ ముందడుగు పడిందని శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.