మూవీడెస్క్: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం, ఉత్తరాదిలో హాలీవుడ్ స్థాయి వసూళ్లను రాబట్టింది.
అయితే, తమిళనాడు మార్కెట్లో మాత్రం ఈ సినిమా అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా తమిళ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకర్షించలేకపోయింది.
తమిళ వెర్షన్‌కు భారీ స్థాయిలో ప్రమోషన్లు చేసినప్పటికీ, సినిమా విడుదలైన తర్వాత మిశ్రమ స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా తగ్గింది.
52 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా, చివరికి 34.86 కోట్ల షేర్‌తోనే క్లోజ్ అయ్యింది.
దీంతో డిస్ట్రిబ్యూటర్లకు 17.14 కోట్ల మేర నష్టాలు వచ్చాయని సమాచారం.
ముఖ్యంగా, సినిమా నెమ్మదిగా సాగడమే ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు.
కేరళలో కూడా పుష్ప 2 కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అక్కడ మొదటిసారిగా అంచనాలకు తగ్గ ఫలితాలు కనిపించాయి.
కానీ, నైజాం, హిందీ మార్కెట్లలో సినిమా రికార్డు వసూళ్లు సాధించడంతో, ఈ నష్టాన్ని నిర్మాతలు సమతూకం చేయగలిగారు.
ఏది ఏమైనా, పుష్ప 2 మాస్ హంగామా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ని షేక్ చేసినా, తమిళనాడు, కేరళలలో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది.