జాతీయం: పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు: రాష్ట్రాలకు 50% కోటా ఇక చెల్లదు!
పీజీ మెడికల్ సీట్ల కేటాయింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న రాష్ట్రాలకు 50% కోటా ఇకపై ఉండబోదని స్పష్టం చేసింది. ఇకపై నీట్ మెరిట్ ఆధారంగానే సీట్లను భర్తీ చేయాలని తేల్చిచెప్పింది.
తమ రాష్ట్ర విద్యార్థులకు 50% కోటా ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి ఇక మద్దతు లేదని కోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్ర కోటా సీట్లు కూడా జాతీయ స్థాయిలో పోటీ చేసేవారికే లభిస్తాయని స్పష్టం చేసింది. నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది.
సుప్రీంకోర్టు తన తీర్పులో రాజ్యాంగంలోని అర్టికల్ 14 (సమానత్వ హక్కు) గురించి ప్రస్తావించింది. “దేశంలో ఎవరైనా ఎక్కడైనా చదువుకునే హక్కు కలిగి ఉన్నారు. విద్యా అవకాశాల్లో రాష్ట్రాల వారీగా భేదాభిప్రాయాలు ఉండకూడదు” అని స్పష్టం చేసింది.
“భారతదేశం మొత్తం ఒకటే, ప్రావిన్స్ లేదా రాష్ట్ర విభజన పేరుతో విద్యలో పరిమితులు విధించడం తగదు. ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించాలి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ తీర్పుతో పీజీ మెడికల్ విద్యలో రాష్ట్రాలకు ప్రత్యేక కోటా ఉండదని స్పష్టమైంది. ఇకపై నీట్ మెరిట్ స్కోర్ ఆధారంగా మాత్రమే సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. విద్యా అవకాశాల్లో సమానత్వాన్ని పెంపొందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యమని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పు దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులపై ప్రభావం చూపనుంది. రాష్ట్ర కోటా వల్ల తన రాష్ట్రానికి ఎక్కువ అవకాశాలు దక్కుతాయనే ఆశతో ఉన్న అభ్యర్థులకు ఇది నిరాశ కలిగించే అంశమే. మరోవైపు నీట్ మెరిట్ ఆధారంగా మాత్రమే సీట్లు భర్తీ చేస్తే ప్రతిభ గల విద్యార్థులకు న్యాయం జరుగుతుందని న్యాయవాదులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా రాష్ట్ర కోటాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పు ఆ నిర్ణయానికి మరింత బలం చేకూర్చినట్లైంది. ఇకపై మెడికల్ విద్యార్థులు ప్రాంతం కాదు, ప్రతిభే ప్రాముఖ్యత అనే ధోరణిలో ముందుకు సాగాల్సి ఉంటుంది.