తెలంగాణ: ఫిబ్రవరి 10లోగా కొత్త టూరిజం పాలసీ: పర్యాటకాభివృద్ధికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 10లోగా కొత్త టూరిజం పాలసీని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పాలసీ దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా అత్యుత్తమంగా ఉండాలి అని స్పష్టం చేశారు.
సీఎం ప్రత్యేకంగా ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం పై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రకృతి సంపదను, పుణ్యక్షేత్రాలను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
సమ్మక్క-సారలమ్మ జాతర సమయంలో భారీగా భక్తులు, పర్యాటకులు రాష్ట్రానికి వస్తారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పర్యాటక శాఖ, అటవీ శాఖ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. జాతర జరిగే ప్రాంతాలను, సమీప ఆలయాలను కలిపి ప్రత్యేక టూరిజం సర్క్యూట్ రూపకల్పన చేయాలని సూచించారు.
ఎకో టూరిజం అభివృద్ధి కోసం ఆదిలాబాద్, వరంగల్, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలతో పర్యాటక ప్రాజెక్టులను రూపొందించాల్సిందిగా అధికారులకు సూచించారు. సింగపూర్ తరహా ఎకో టూరిజం మోడల్స్‌ను అధ్యయనం చేసి, రాష్ట్రానికి అనువైన విధంగా అమలు చేయాలని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అవసరమని సీఎం తెలిపారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఇందిరా పార్క్‌లను కలిపి ప్రత్యేక టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు.
గోదావరి, కృష్ణా పుష్కరాల సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులను, పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపును, ఆదాయాన్ని పెంచేలా టూరిజం పాలసీ ఉండాలని సీఎం స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, సీఎస్ శాంతికుమారి, ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.