తెలంగాణ: ఉప ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. ఈ దిశగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తాజా ట్వీట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. పార్టీ ఫిరాయింపుదారుల సభ్యత్వాల రద్దుపై సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలతో కేటీఆర్ తన వ్యాఖ్యలను ముడిపెట్టారు.
ఉప ఎన్నికలు తథ్యమని, బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇటీవల బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు.
దీనిపై అసెంబ్లీ స్పీకర్‌ను ఆశ్రయించినా స్పష్టమైన నిర్ణయం రాకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పీకర్ కార్యాలయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరింత జాప్యం ఎందుకు అని ప్రశ్నించింది. సుప్రీం తీర్పు తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో నేతలు, క్యాడర్ ఇప్పటికే ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
కేటీఆర్ పిలుపు బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది.