హైదరాబాద్: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఇటీవల జరిగిన ఐటీ దాడులు టాలీవుడ్లో సంచలనంగా మారాయి.
నాలుగు రోజులపాటు ఆయన ఇంటి, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించగా, సంబంధిత లావాదేవీలపై పూర్తి వివరాలు అందించాలని నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.
తాజాగా, దిల్ రాజు ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి హాజరై, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించారు.
ఈ సందర్భంగా దిల్ రాజు ఐటీ అధికారులకు బ్యాంక్ స్టేట్మెంట్లు, ప్రొడక్షన్ హౌస్ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు అందజేశారు.
అయితే, ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సంక్రాంతి సీజన్లో రెండు సినిమాలను విడుదల చేసిన నేపథ్యంలో, వాటి వసూళ్లు, లాభనష్టాలపై ఐటీ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన తనిఖీలపై స్పందించిన దిల్ రాజు, ఇది సాధారణ ప్రక్రియ అని అన్నారు. “ఇది పరిశ్రమ మొత్తం మీద జరుగుతున్న దాడులలో భాగమే.
కానీ కొన్ని మీడియా వర్గాలు అటు ఇటుగా ప్రచారం చేస్తున్నాయి” అని ఆయన స్పష్టం చేశారు.
తన ప్రొడక్షన్కు సంబంధించి ఎలాంటి అనధికారిక లావాదేవీలు లేవని, తనకు ఎలాంటి సమస్య లేదని దిల్ రాజు తెలిపారు.
ప్రస్తుతం పరిశ్రమలో పలు ప్రముఖ నిర్మాతల ఇళ్లల్లోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో, టాలీవుడ్లో ఈ దాడుల ప్రభావం ఇంకా ఎలాంటి పరిణామాలను తెచ్చిపెడుతుందో చూడాలి.