ఏపీ: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో తాజాగా నలుగురిపై పోలీసులు కొత్తగా కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా డీఎస్పీ స్థాయి అధికారితో పాటు సీఐ స్థాయిలో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవడం కలకలం రేపుతోంది.
ఈ పరిణామంతో వివేకా హత్య కేసు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాన సాక్షి, అప్రూవర్‌గా మారిన దస్తగిరి తనపై గతంలో జరిగిన వేధింపులను తాజాగా వెల్లడించాడు. వైసీపీ హయాంలో తన ఫిర్యాదులను పట్టించుకోలేదని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక తనకు న్యాయం జరిగిందని చెప్పడం గమనార్హం.
దస్తగిరి ఫిర్యాదు మేరకు పోలీసులు పులివెందులలో కేసులు నమోదు చేశారు. కేసు నమోదు అయినవారిలో జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్య, మాజీ కడప జిల్లా ఎస్పీ ప్రశాంత్, నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి ఉన్నారు.
వీరిపై బెదిరింపు, వేధింపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ పరిణామం జగన్ కుటుంబానికి రాజకీయంగా కొత్త సమస్యలు తెస్తుందా? లేదా కేసులో ఇంకా సరికొత్త నిజాలు వెలుగులోకి వస్తాయా? అన్న దానిపై ఆసక్తి నెలకొంది.