ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రచారం మంచి ఫలితాలు ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని గంటల పాటు మాత్రమే ప్రచారం చేసినా, ఆయన ప్రసంగాలు భారీ స్పందన తెచ్చుకున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడుతూ, వికసిత భారత్ కోసం బీజేపీకి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు చేసిన విజ్ఞప్తి ఓటర్లను ప్రభావితం చేసినట్లు చెబుతున్నారు.
ఓట్ల లెక్కింపులో చంద్రబాబు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉండటం గమనార్హం. షహారాబాద్, షాదారా, సంగం విహార్, సహద్ర ప్రాంతాల్లో ఆయన నిర్వహించిన రోడ్‌షోలు, బహిరంగ సభలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి.
ప్రత్యేకంగా, అద్దాల భవంతులు కట్టుకున్న నేతలను ఓటుతో తిరస్కరించాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజలపై ప్రభావం చూపినట్లు చెబుతున్నారు.
టీడీపీ శ్రేణులు ఢిల్లీలో తమ అధినేత చేసిన ప్రచారం విజయవంతమైందని సంబరాలు జరుపుకుంటున్నారు. చంద్రబాబు ప్రస్తావించిన అభివృద్ధి, మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు విశ్వాసం ఉంచినట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికల్లో తెలుగు ప్రజలు టీడీపీ నాయకత్వాన్ని గౌరవించారని, దీని ప్రభావం భవిష్యత్‌లో మరింత కనపడుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
దీంతో బీజేపీ – టీడీపీ సంబంధాలు మరింత బలపడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు ప్రచారం ద్వారా బీజేపీకి లభించిన ఈ మద్దతు భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాల్లోనూ టీడీపీ ప్రభావాన్ని పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.