జాతీయం: భారతీయ రైల్వేలో అణు శక్తి వినియోగంపై రాజ్యసభలో ఆసక్తికర చర్చ జరిగింది.
శిలాజ ఇంధనానికి ప్రత్నామ్నాయం
భారతీయ రైల్వే విద్యుత్ అవసరాల పెరుగుదల నేపథ్యంలో శిలాజ ఇంధనంపై ఆధారాన్ని తగ్గించి, అణు విద్యుత్ వినియోగించే దిశగా అడుగులు వేస్తోంది. రైల్వే శాఖ ప్రస్తుతం పర్యావరణహిత ప్రత్యామ్నాయ విద్యుత్ వనరులను అన్వేషిస్తూ, అణు శక్తి వినియోగంపై పరిశీలన చేస్తోంది.
రాజ్యసభలో చర్చ
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ ఈ అంశంపై రాజ్యసభలో ఒక ప్రశ్న లేవనెత్తారు. రైల్వే అభివృద్ధి కోసం అణు విద్యుత్ వినియోగించాలనుకుంటుందా? ఇందులో భారత్ ఎంత పురోగతి సాధించింది? అంటూ ప్రశ్నించారు. దీనికి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వ కసరత్తు
రైల్వే అణు విద్యుత్ వినియోగంపై పరిశీలన చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL), విద్యుత్ మంత్రిత్వ శాఖ లతో కలిసి ప్రాధమిక సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. ఈ దిశగా టెక్నికల్, ఆర్థిక, పర్యావరణ అంశాలపై సమగ్ర అధ్యయనం కొనసాగుతోందని తెలిపారు.
అణు విద్యుత్ ప్రయోజనాలు & పర్యావరణ ప్రభావం
రైల్వే అణు విద్యుత్ వినియోగానికి సంబంధించిన పర్యావరణ ప్రభావంపై ప్రశ్నించగా, మంత్రి అణు శక్తి శుభ్రమైన, పర్యావరణహిత ఇంధన వనరు అని పేర్కొన్నారు. ఇది కర్బన ఉద్గారాలను తగ్గించే అవకాశాన్ని కల్పిస్తుందని వివరించారు. శిలాజ ఇంధనాలపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా రైల్వే పర్యావరణ అనుకూల మార్గం వైపు అడుగులు వేయనున్నట్లు స్పష్టం చేశారు.
భవిష్యత్తులో కీలక నిర్ణయాలు
భారతీయ రైల్వే ఇప్పటికే సౌర శక్తి, విండ్ ఎనర్జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించే దిశగా చర్యలు చేపట్టింది. అణు విద్యుత్ వినియోగంపై పరిశీలనలు కొనసాగుతున్నాయి. అయితే, వ్యయాలు, సాంకేతిక సవాళ్లు, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.