“రామరాజ్యం” రాఘవరెడ్డి వివాదం – ఆలయాల ఆస్తులే లక్ష్యమా?
చిలుకూరు ఆలయ ఘటనపై మళ్లీ దృష్టి
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి “రామరాజ్యం” సంస్థ వ్యవస్థాపకుడు వీర రాఘవరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆలయ భూములపై ఆధిపత్యం, భక్తులను ప్రభావితం చేయడమే లక్ష్యంగా “రామరాజ్యం” గ్రూప్ పనిచేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పోలీసులు వీర రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
చిన్న జీయర్ను కూడా టార్గెట్ చేశారా?
ఇప్పుడు మరో కొత్త కోణం తెరపైకి వచ్చింది. గతంలో వీర రాఘవరెడ్డి చిన్న జీయర్ స్వామిపై కూడా విమర్శలు గుప్పించిన వీడియో వైరల్ అవుతోంది. “గోత్రాలను సంకరం చేయడానికి మీరెవరు?” అంటూ ఆయన విమర్శలు చేశారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన అతిపెద్ద రామానుజ విగ్రహం వ్యవహారంలో చిన్న జీయర్ గోత్రాలను కలిపేస్తున్నారని, భవిష్యత్‌లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వీర రాఘవరెడ్డి పేర్కొన్నారు. తన దగ్గరకు వచ్చే వారిని “రామానుజ ” గోత్రీకులుగా చిన్న జీయర్ పిలుస్తారని దానివల్ల గోత్రాలన్నీ మారిపోతున్నాయని రాఘవ రెడ్డి వీడియో చేశారు. “మహిపాల” గోత్రానికి చెందిన తాము వివాహాలు చేసుకోవడానికి కొన్ని గ్రోత్రాలు ఉన్నాయని అలాంటిది చిన్న జీయర్ గోత్రాలన్నీ కలిపేస్తే ఎలా” అనేది రాఘవరెడ్డి వాదన.
ఆలయ భూములపై ఎత్తుగడా?
వీర రాఘవరెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం ఉన్న 27,800 గ్రామాల నుంచి కనీసం ఒక్కో భక్తుడైనా వచ్చి రామరాజ్యం ఏర్పాటు చేయాలి అనే ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి యూట్యూబ్‌లో అనేక వీడియోలు కూడా అప్లోడ్ చేశారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇది ఆలయ భూములపై హక్కులు సంపాదించేందుకు, దేవాలయాలపై ఆధిపత్యం కోసం తీసుకున్న వ్యూహం కావొచ్చని అంటున్నారు.
“రామరాజ్యం” అంటే ఇది కాదు – చిన్న జీయర్
ఈ వివాదంపై చిన్న జీయర్ స్వామి స్పందిస్తూ, “రామరాజ్యం సాధించాలంటే మార్గం హింస కాదు, సామరస్యమే అసలు మార్గం” అని స్పష్టం చేశారు. హింసతో, వివాదాలతో ఏ రామరాజ్యమూ సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.
భక్తుల మద్దతు రంగరాజన్‌కు
చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై జరిగిన దాడి ఘటన హిందూ భక్తుల్లో ఆగ్రహాన్ని రేపింది. సామాజిక మాధ్యమాల్లో ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. “దాడులు హిందూ ధర్మ లక్షణం కాదు” అంటూ భక్తులు వీర రాఘవరెడ్డి చర్యను ఖండిస్తున్నారు.
ఈ కేసులో ఇంకా ఏమి బయటకు వస్తుందో?
ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో ఈ కేసు ఉంది. పూర్తి విచారణానంతరం రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. హిందూ ఆలయాల భూములు, హిందూ సంస్థల పాలనపై కొనసాగుతున్న ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.