టాలీవుడ్: డైలాగ్ కింగ్ మోహన్ బాబు భక్తులందరికీ వినాయక పూజా విధానం ‘వినాయక కథ’ ద్వారా తెలియ చేసే ప్రయత్నం చేసారు. వినాయక చవితి సందర్భంగా వినాయక కథ అని ఒక ప్రత్యేక వీడియో తన మాటల ద్వారా తయారు చేసి సోషల్ మీడియా లో విడుదల చేసారు. ”నేను చదవడం వినడం దగ్గర నుండి నేను ప్రతి సంవత్సరం ఇష్టపడే పండుగలు ఎన్నో ఉన్నాయి. అందులో మొదటగా నేను ఇష్టపడే పండుగ వినాయక చవితి” అంటూ మోహన్ బాబు ‘వినాయక చవితి’ పూజా విధానాన్ని, వినాయకుని కథను చక్కగా వివరించారు.
మోహన్ బాబు ఈ వీడియోని షేర్ చేస్తూ ”వినాయక చవితి సందర్భంగా గణనాథుడి కథను వివరించే ప్రయత్నం చేశాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ స్నేహితుల కోసం దీనిని రూపొందించాను. ఓమ్ గణేశాయ నమ:” అని ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ప్రతి ఏడాది పండుగకు సన్నిహితులను ఆహ్వానించడం తన కుటుంబంలో ఒక సంప్రదాయం, వారికి కుటుంబ సభ్యులతో పాటు గణనాథుడి కథను చెప్తానని పేర్కొన్నారు. గజాసుర కథను, వినాయకుడి జన్మ కథను, ఏనుగు తల వెనుక ఉన్న కారణాన్ని మోహన్ బాబు వివరించాడు. వినాయక చతుర్థి పండుగ యొక్క ప్రాముఖ్యతను, పండుగను జరుపుకోవడం వెనుక కథ గురించి చెప్తూ భక్తులందరికీ ఈ కథ చెప్పడానికి ఈ వీడియో చేయమని తన కొడుకులు సలహా ఇచ్చారని మోహన్ బాబు వెల్లడించారు.
కరోనా వల్ల కొంత మంది మేధావుల కొత్త కొత్త ఆలోచనలు అందరికి చేరువవుతున్నాయి. తరువాతి తరాలకి సంస్కృతి సంప్రదాయాలు చేరవేయడానికి మోహన్ బాబు చేసిన ప్రయత్నం అభినందనీయం. ఈ జెనరేషన్ వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఇలాంటి వీడియోలు చేసి చెప్తేనే వినే పరిస్థితి ఉంది. అలాగే పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు పోడ్కాస్ట్ ద్వారా చాలా అద్భుతమైన విషయాలని, ఆలోచనలని షేర్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీ లో ఈ కొత్త ప్రయత్నం సమాజం లో మంచి మార్పు తీసుకొస్తుంది.