హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని, తాము కూడా పింక్ బుక్ మెయింటెన్ చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే ఈ వేధింపులకు జవాబిస్తామని అన్నారు.
ట్విట్టర్‌లో కామెంట్ పెట్టినా, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతుంటే, రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని వ్యాఖ్యానించారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని కవిత తప్పుపట్టారు. బీసీ బిల్లును కేంద్రానికి పంపించి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల కోసం వేర్వేరు బిల్లులు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇస్తూ వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించారు. కోర్టు కేసులకోసం జాప్యం చేయవద్దని హితవు పలికారు.
కుల గణనకు మరోసారి అవకాశం ఇవ్వడంపై స్పందిస్తూ, ఒక నెల సమయం ఇచ్చి పూర్తి పారదర్శకతతో సర్వే చేయాలని కోరారు.