ఆంధ్రప్రదేశ్: గులియన్ బారే సిండ్రోమ్ (GBS) అనే వ్యాధి క్రమంగా ప్రబలుతోంది. ముఖ్యంగా గుంటూరు జీజీహెచ్‌లో ఈ వ్యాధితో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాధికి ప్రత్యేక చికిత్స అందించే ఆసుపత్రి గుంటూరులో మాత్రమే ఉండటం వల్ల, రోగులు అక్కడికి తరలిపోతున్నారు.
తాజాగా, ప్రకాశం జిల్లా అలసందపల్లికి చెందిన కమలమ్మ ఈ వ్యాధితో బాధపడుతూ గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించారు. జ్వరంతో పాటు కాళ్లు చచ్చుబడిపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఈ నెల 3న ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు GBS అని నిర్ధారించి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ, ఆమె కోలుకోలేకపోయారు.
GBS ప్రధానంగా నరాలకు సంబంధించిన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి ఆరోగ్య సమస్యల వల్ల లేదా వైరల్ ఇన్‌ఫెక్షన్ల కారణంగా రావచ్చు.
అయితే, ఇది అంటు వ్యాధి కాదు కనుక ప్రజలు అలర్ట్‌గా ఉంటే సరిపోతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వ్యాధి తీవ్ర స్థాయికి చేరితే కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ తొలి లక్షణాలు గమనించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటే, పూర్తిగా కోలుకోవచ్చు.
ప్రస్తుతం గుంటూరులోని ఆసుపత్రిలో GBS కేసులపై వైద్య బృందం పరిశీలనలు ముమ్మరం చేసింది. ప్రజలు స్వీయ చికిత్సకు ప్రయత్నించకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.