తెలంగాణ: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్‌గల్‌లో జరిగిన రైతు మహాధర్నాలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ఎవరూ సంతృప్తిగా లేరని, స్థానిక సంస్థల ఎన్నికల ముందు మళ్లీ ప్రజలను మోసగించేందుకు నాటకాలు మొదలుపెట్టారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ హయాంలో రైతులు రాజులా బ్రతికారని, కానీ రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి తెలియదని విమర్శించారు. ఢిల్లీలో 35 సార్లు పర్యటించినా రైతుల కోసం 35 పైసలు కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. రుణ మాఫీపై ప్రభుత్వం మొండి వైఖరి కొనసాగిస్తోందని, అప్పులు కట్టలేదని రైతుల ఇళ్ల తలుపులు సైతం గుత్తుకట్టుకుపోతున్నాయని ఆరోపించారు.
బీసీ వర్గాలను కుల గణన పేరిట మోసం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో ఏ అభివృద్ధి జరగలేదని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ సహా, ఆయన అత్తగారి ఊరైన కల్వకుర్తిలో అభివృద్ధి జాడలేదని అన్నారు.
ప్రజలు మళ్లీ కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోతే భవిష్యత్‌లో కాపాడటం కష్టమని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గుర్తుంచుకోవాలని సూచించారు.