ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ ది రాజా సాబ్ మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొదట ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా, తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ కొత్త తేదీ కోసం చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.
సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పనిలో జాప్యం జరుగుతుందని టాక్. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలకంగా మారనున్నాయి. అందువల్ల మేకర్స్ ఎలాంటి రాజీ పడకుండా అత్యుత్తమ ప్రమాణాలను పాటించాలని చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయడం కష్టమని, జూలై 18కి మారే అవకాశముందని సమాచారం. అయితే, ఈ తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మేకర్స్ గ్రాఫిక్స్ పనిని వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది.
ప్రభాస్ సినిమాలన్నీ భారీ స్థాయిలో విడుదలయ్యే క్రమంలో, అభిమానుల్లో అంచనాలు ఎక్కువగా ఉంటాయి. సలార్, కల్కి లాంటి సినిమాలు కూడా అనుకున్న టైమ్‌కు రాకపోవడంతో, ది రాజా సాబ్ విషయంలోనూ అదే జరుగుతుందా? అన్న అనుమానం నెలకొంది.
ప్రస్తుతం మేకర్స్ తగిన ప్రమాణాలు అందుకునేలా సినిమా పనులు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, సినిమా ఫైనల్ షెడ్యూల్ ఎప్పుడు పూర్తి అవుతుందో, అధికారికంగా మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.