జాతీయం: తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం – కేంద్రం విడుదల చేసిన నిధులు
దేశంలోని ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సహాయ నిధులు ప్రకటించింది. ఇందులో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌కు రూ.608.08 కోట్లు, తెలంగాణకు రూ.231.75 కోట్ల ఆర్థిక సాయం మంజూరు చేసింది.
గత ఏడాది సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో విజయవాడ, చుట్టుపక్కల ప్రాంతాల్లో, అలాగే తెలంగాణలో ఖమ్మం జిల్లాలో వరదలు సంభవించాయి. ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం
కేంద్ర హోంశంత్రి అమిత్ షా నేతృత్వంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ఈ సహాయ నిధులను విడుదలకు ఆమోదం లభించింది. మొత్తం ఐదు రాష్ట్రాలకు రూ.1,554.99 కోట్లను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, నాగాలాండ్‌కు రూ.170.99 కోట్ల సహాయం ప్రకటించారు. ప్రకృతి వైపరీత్య నిధి (NDRF) నుంచి ఇప్పటికే విడుదలైన మొత్తానికి అదనంగా ఈ నిధులు మంజూరు చేసినట్లు హోంశాఖ వెల్లడించింది.
రాష్ట్రాల నుండి భారీ నిధుల అభ్యర్థన
వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని భారీ నిధుల కోసం అభ్యర్థించాయి.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద నష్టాలను సరిదిద్దేందుకు రూ.6,800 కోట్లు
- తెలంగాణ ప్రభుత్వం రూ.5,000 కోట్లు
అవసరమని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే, కేంద్రం అప్పట్లో మొదటిస్థాయిలో రాష్ట్ర ప్రకృతి వైపరీత్య స్పందన నిధి (SDRF) నుంచి నిధులు మంజూరు చేసింది.
గతంలో విడుదల చేసిన నిధులు
గత ఏడాది అక్టోబర్ 1న, SDRF నిధుల కింద కేంద్రం విడుదల చేసిన మొత్తం:
- ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లు
- తెలంగాణకు రూ.416.80 కోట్లు
ఇప్పుడిప్పుడు విడుదలైన నిధులు ఈ మొత్తానికి అదనంగా కేటాయించబడ్డాయి.
ప్రధాని మోదీ, అమిత్ షాలకు చంద్రబాబు కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్షించారు. రాష్ట్ర విపత్తు సహాయ చర్యలకు మద్దతుగా ప్రకటించిన రూ.608.08 కోట్ల ఆర్థిక సాయంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంశంత్రి అమిత్ షాలకు ఎక్స్ (Twitter) వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.