తెలంగాణ: బర్డ్‌ఫ్లూ – కుదేలైన పౌల్ట్రీ రంగం
బర్డ్‌ఫ్లూ భయంతో..
రుచికరమైన కోడికూరకు ఆదరణ తగ్గిపోయింది. చికెన్ ముక్కలేనిదే భోజనం పూర్తికానివారూ, వారానికి కనీసం రెండు మూడు సార్లు చికెన్ తినే మాంసాహార ప్రియులూ ఇప్పుడు చికెన్‌ను పూర్తిగా పక్కన పెట్టేసారు. రాష్ట్రవ్యాప్తంగా చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీనికి ప్రధాన కారణం బర్డ్‌ఫ్లూ భయం.
తెలంగాణపై ప్రభావం లేకపోయినా..
ఆంధ్రప్రదేశ్, దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నా, తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు అలాంటి ప్రభావం కనిపించలేదు. అయినప్పటికీ, సోషల్ మీడియా ద్వారా అవాస్తవ ప్రచారం జరుగుతున్నందున ప్రజలు చికెన్, గుడ్లను కొనుగోలు చేయడం మానేశారు.
కోళ్ల రైతులకు తీవ్ర నష్టం
బర్డ్‌ఫ్లూ భయంతో కోళ్ల విక్రయాలు దారుణంగా తగ్గిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8.5 కోట్లకుపైగా కోళ్లు ఉన్నాయి. బాయిలర్, లేయర్ కోళ్లను పెద్ద ఎత్తున పెంచే రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయారు. ఒకప్పుడు లైవ్ కోడి కిలో ధర రూ.180 ఉండగా, ఇప్పుడు రూ.90కి పడిపోయింది. గుడ్ల ధరలు కూడా భారీగా తగ్గి, ఒక్క గుడ్డు రూ.3.50కే ధర పలుకుతోంది.
దళారులకు లాభాలు – రైతులకు నష్టం
బర్డ్‌ఫ్లూ భయాన్ని లాభంగా మలుచుకుని దళారులు రైతుల నుంచి కోళ్లు, గుడ్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అయితే మార్కెట్లో మాత్రం గుడ్లు, కోడి మాంసం ధరలపై పెద్దగా ప్రభావం పడలేదు. చికెన్ కిలో రూ.160-180, గుడ్లు ఒక్కొక్కటి రూ.6కి విక్రయించబడుతున్నాయి. రైతులు నష్టపోతుండగా, మధ్యవర్తులు మాత్రం లాభాలు గడిస్తున్నారు.
రంగాలకూ దెబ్బ
పౌల్ట్రీ రంగం సంక్షోభంలో పడిపోవడంతో అనుబంధ రంగాలు కూడా నష్టపోతున్నాయి. రైతులు దాణా కొనుగోలు తగ్గించడంతో మొక్కజొన్న, సోయాబీన్ అమ్మకాలు పడిపోయాయి. జనవరిలో రూ.28 పలికిన మొక్కజొన్న కిలో ఇప్పుడు రూ.23కి తగ్గిపోయింది. అలాగే, రూ.40కుపైగా ఉన్న సోయాబీన్ ధర రూ.27కి పడిపోయింది.
రాష్ట్ర సరిహద్దుల్లో నియంత్రణ
బర్డ్‌ఫ్లూ నియంత్రణ కోసం కోళ్ల ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా నిలిపివేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో 27 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణాపై కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేస్తున్నారు. బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో రైతుల నష్టాలు మరింత పెరిగాయి.
వైరస్ వ్యాప్తిపై భయాలు
పౌల్ట్రీ రంగ నిపుణుల ప్రకారం, 60-70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చికెన్‌ను ఉడికిస్తే బర్డ్‌ఫ్లూ వైరస్ పూర్తిగా నశిస్తుంది. మనం సాధారణంగా 100 డిగ్రీల పైగా ఉడికిస్తాం కాబట్టి, చికెన్ తినడంలో ఎలాంటి ప్రమాదం లేదని అంటున్నారు. మనుషులకు ఈ వైరస్ సోకడం చాలా అరుదని, అనవసర భయాలకు గురికావొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.
పౌల్ట్రీ రైతులకు ప్రభుత్వం సహాయం?
తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ కార్యదర్శి పాతూరి వెంకట్రావ్, రాష్ట్ర పౌల్ట్రీ అసోసియేషన్ ట్రెజరర్ వంగేటి అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వమే ముందుకు వచ్చి ప్రజలకు సరైన అవగాహన కల్పించాలన్నారు. లేనిపోని భయాలను నమ్మి కోళ్ల రైతులను మరింత కష్టాల్లో నెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.
వనపర్తి జిల్లాలో..
వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో మూడు రోజుల్లో 4,000 కోళ్లు మృతి చెందాయి. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు పరిశీలించిన తర్వాత, ఇది బర్డ్‌ఫ్లూ వల్ల కాకుండా, సాధారణ “కొక్కెర వ్యాధి” వల్లనే జరిగినట్లు వెల్లడించారు. అయినప్పటికీ రైతులు, ప్రజలూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.