ఏపీ: భారత పౌర విమానయాన రంగం ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. గడచిన దశాబ్దంలో ఈ రంగం అనూహ్యమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుతం దేశంలో 157 విమానాశ్రయాలు ఉండగా, రానున్న ఐదేళ్లలో వీటి సంఖ్య 200కు పైగా చేరుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
గురువారం డీజీసీఏ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ పర్సనెల్ లైసెన్స్ (EPL) వ్యవస్థను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ విస్తరణతో దేశంలో 20,000 పైలట్లు అవసరమవుతారని చెప్పారు. పెరుగుతున్న ఎయిర్ ట్రాఫిక్‌కి అనుగుణంగా పైలట్ శిక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు గణనీయంగా పెరుగుతున్నాయని, కొత్తగా 1,700 విమానాలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ అభివృద్ధితో దేశం అంతర్జాతీయంగా మరింత బలమైన కనెక్టివిటీ పొందుతుందని అన్నారు.
ఎలక్ట్రానిక్ పర్సనెల్ లైసెన్స్ ద్వారా పైలట్ లైసెన్స్ ప్రక్రియ వేగవంతం కానుంది. 24 గంటలు ఆన్‌లైన్‌లో సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు.