టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ఆయన భార్య ధనశ్రీ వర్మ మధ్య విడాకుల పుకార్లకు నిజం రూపం దాల్చింది. పరస్పర అంగీకారంతో, చట్టపరమైన ప్రక్రియ పూర్తికావడంతో వారి వివాహ బంధం అధికారికంగా ముగిసింది.
నిన్న ముంబై బాంద్రా ఫ్యామిలీ కోర్టులో ఇద్దరూ హాజరై, న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం 45 నిమిషాల కౌన్సెలింగ్‌కు వెళ్లారు. ఆ తర్వాత కూడా ఇద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు.
గత 18 నెలలుగా వేర్వేరు జీవితాలు గడుపుతున్నామని, కలసి జీవించడం సాధ్యం కాకపోవడమే ఈ నిర్ణయానికి కారణమని వారు కోర్టుకు వివరించారు. న్యాయమూర్తి సాయంత్రం 4.30 గంటలకు విడాకులు మంజూరు చేస్తూ, వారి వివాహ బంధం ముగిసినట్లు ప్రకటించారు.
ఈ ప్రక్రియ అనంతరం ధనశ్రీ సోషల్ మీడియాలో భావోద్వేగంగా స్పందించింది. ‘‘బాధలు, పరీక్షలు దేవుని ఆశీర్వాదాలుగా మారతాయి. ఈరోజు ఏదైనా ఇబ్బంది ఎదురైతే, మరో అవకాశం కోసం ప్రార్థించండి,’’ అని చెప్పింది.