జాతీయం: ధూమపాన ప్రియులకు కేంద్రం షాక్ ఇవ్వనుంది.
ధూమపాన ప్రియులకు కేంద్రం షాకింగ్ నిర్ణయం
దేశవ్యాప్తంగా ధూమపానం చేసే వారికి కేంద్ర ప్రభుత్వం చేదువార్త చెప్పబోతోంది. త్వరలోనే పొగాకు ఉత్పత్తులపై పన్నులను భారీగా పెంచే యోచనలో ఉంది. దీంతో సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
పన్ను ఆదాయాన్ని కాపాడేందుకు చర్యలు
ప్రస్తుతం పొగాకు ఉత్పత్తులపై 28% జీఎస్టీ విధిస్తున్న ప్రభుత్వం, అదనపు ఛార్జీలతో కలిపి 52% వరకు పన్నులు వసూలు చేస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం, జీఎస్టీని 28% నుంచి 40% శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
ముగియనున్న పరిహార సెస్ గడువు
సిగరెట్లపై విధించిన పరిహార సెస్ గడువు 2026 మార్చితో ముగియనుంది. అయితే, పన్ను ఆదాయం తగ్గకుండా చూసుకోవడానికి కేంద్రం కొత్త సెస్‌ను ప్రవేశపెట్టకూడదని భావిస్తోంది. అందుకే ప్రత్యామ్నాయంగా పొగాకు ఉత్పత్తులపై పన్ను శాతం పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తోంది.
జీఎస్టీ కౌన్సిల్ సమీక్షలో నిర్ణయం
ఈ ప్రతిపాదనపై జీఎస్టీ కౌన్సిల్ పరిధిలోని మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహిస్తోంది. తుది నిర్ణయానికి ముందుగా, కమిటీ సిఫార్సులను సమర్పించనున్నట్లు సమాచారం.
పొగాకు వినియోగంపై నియంత్రణకు కఠిన చట్టాలు
ధూమపానం ఆరోగ్యానికి హానికరం. దీని వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకే, సిగరెట్లను ‘పాపపు వస్తువుల’ జాబితాలో చేర్చి వాటిపై అధిక పన్ను విధిస్తున్నారు.
కొసమెరుపు
ప్రస్తుతం మన దేశంలో సిగరెట్లపై 53% పన్ను విధిస్తున్నారు. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన 75% కంటే ఇది తక్కువ. ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు కేంద్రం చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.