స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహ్మద్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. రోహిత్ శర్మ బరువు తగ్గాలని, అతను అత్యుత్తమ కెప్టెన్ కాదని ఆమె తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని లేపాయి.
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ సహా క్రికెట్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. తాజాగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. జట్టుపై నెగటివ్ కామెంట్లు ఆటగాళ్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని, బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు.
అయితే, షమా మహ్మద్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ చేయలేదని, కేవలం ఒక అభిప్రాయం వ్యక్తం చేశానని ఆమె అన్నారు. ఆటగాళ్లు ఫిట్‌గా ఉండాలని తాను నమ్ముతానని వివరణ ఇచ్చారు.
ఈ వివాదంపై నెటిజన్లు వర్గాలవారీగా స్పందించారు. రోహిత్ శర్మ అభిమానులు ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతుండగా, కొంతమంది రాజకీయ మతలబుతో ఈ వివాదం బయటకు తీయబడిందని అంటున్నారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో టీమిండియా సెమీస్‌కు చేరిన నేపథ్యంలో, ఈ వివాదం అవసరమా అని మరికొందరు అంటున్నారు.