అంతర్జాతీయం: జెలెన్‌స్కీ కు ట్రంప్ షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు మిలటరీ సాయం నిలిపివేసారు.
ఉక్రెయిన్‌కు భారీ ఎదురుదెబ్బ
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు అందిస్తున్న మిలటరీ సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం ఉక్రెయిన్‌కు భారీ ఎదురుదెబ్బగా మారనుంది.
ట్రంప్-జెలెన్‌స్కీ మాటల యుద్ధం
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశం వాడివేడిగా మారింది. జెలెన్‌స్కీ ప్రెస్ ముందే తన అసహనాన్ని, ధిక్కార స్వరాన్ని గట్టిగ వినిపించారు. ఉక్రెయిన్‌కు సహాయం చేస్తున్నప్పటికీ, కృతజ్ఞత చూపడం లేదని ట్రంప్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ట్రంప్ తాజానిర్ణయం జెలెన్‌స్కీ కు యూరోపియన్ యూనియన్ కు మింగుడుపడడం లేదు.
సాయాన్ని సమీక్షించే ప్రతిపాదన
అమెరికా విదేశాంగ శాఖ, రక్షణ శాఖలు ఉక్రెయిన్‌కు అందిస్తున్న మిలటరీ సాయం సమీక్షించాలని నిర్ణయించాయి. ఈ సాయం నిజంగా సమస్య పరిష్కారానికి దోహదపడుతోందా? లేదా? అన్నదానిపై విశ్లేషణ జరిపి తర్వాతే మళ్లీ సాయంపై నిర్ణయం తీసుకుంటామని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
పోలండ్‌లో నిలిపివేసిన నౌకలు, విమానాలు
ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేసే నౌకలు, విమానాలను పోలండ్‌లోని ట్రాన్సిట్ ఏరియాలో నిలిపివేయాలని అమెరికా నిర్ణయించినట్లు వైట్‌హౌస్ అధికారి వెల్లడించారు. ఈ చర్యలు అమెరికా-ఉక్రెయిన్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు పై..
ఈ పరిణామాలకు ముందే రష్యాతో యుద్ధం ముగింపు అంశం చాలా దూరంలో ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. మరోవైపు, ట్రంప్ నిర్ణయం ఉక్రెయిన్ కు ఆశనిపాతంలా పరిణమించిందని భావించవచ్చు.