తెలంగాణ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులను ప్రోత్సహించే తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ఎస్ఎల్బీసీ ప్రమాదం నేపథ్యంలో సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆయన గొప్పగా ప్రశంసించారు.
సహాయక చర్యల్లో ఉత్తమ్ తనకంటే ఎక్కువ అనుభవం కలిగిన వ్యక్తి అని చెప్పడం గమనార్హం. భారత సైన్యంలో పనిచేసిన అనుభవంతో ఉత్తమ్ సమర్థంగా పరిష్కారాలు కనుగొంటారని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఇటీవల ఢిల్లీ వెళ్లిన రేవంత్ తన వెంట ఉత్తమ్‌ను కూడా తీసుకెళ్లారు. నేషనల్ మీడియా సాగునీటి రంగం, సొరంగం ప్రమాదంపై ప్రశ్నించగా, “హీ ఈజ్ ద రైట్ పర్సన్” అంటూ ఉత్తమ్‌కు సమాధానం చెప్పే అవకాశం కల్పించారు. రేవంత్ ఈ విధంగా మంత్రులను ప్రోత్సహించడం రాజకీయ వర్గాల్లో ప్రశంసలు అందుకుంది.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు కూడా పదవుల కోసం పోటీ పడే స్థితిలో ఉన్నా, రేవంత్ మాత్రం సహచర మంత్రులకు ఇంతగా గౌరవం ఇవ్వడం అరుదైన విషయం. ముఖ్యమంత్రి నోట ప్రశంసలు పొందిన ఉత్తమ్ నిజంగానే అదృష్టవంతుడని చెప్పాలి.
ఇలాంటి సందర్భాలు కాంగ్రెస్ పార్టీలో సహజంగా కనిపించవు. సాధారణంగా అధినేతల కీర్తిని మిగతా నేతలు మాత్రమే ప్రచారం చేస్తారు. కానీ రేవంత్ మాత్రం తన సహచరులను సైతం ఆకాశానికి ఎత్తుతూ కొత్త రాజకీయ ధోరణిని ప్రదర్శిస్తున్నారు.