ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీకి మరోసారి కష్టం ఎదురైంది. తాజాగా వనౌటు ప్రభుత్వం అతనికి మంజూరైన పౌరసత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. దేశానికి సంబంధించిన చట్టాలను దుర్వినియోగం చేయొద్దని, చట్టపరమైన కారణాల కోసం మాత్రమే పౌరసత్వం పొందడం సమంజసం కాదని వనౌటు ప్రధాన మంత్రి స్పష్టంగా ప్రకటించారు.
ఈ నిర్ణయం మోడీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. వనౌటు ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, లలిత్ మోడీ ఇంటర్‌పోల్ నోటీసు అంశంపై క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేశారు.
అయితే మోడీపై సరైన న్యాయ ఆధారాలు లేవని ఇంటర్‌పోల్ పేర్కొన్నప్పటికీ, పౌరసత్వాన్ని పొందడంలో ఆయన ఉద్దేశం పూర్తిగా తప్పించుకునేందుకేనని వనౌటు ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అతని పాస్‌పోర్టును రద్దు చేసేందుకు సిద్ధమైంది.
ఇప్పటికే మోడీ తన పాస్‌పోర్టును భారత హైకమిషన్‌కు అప్పగించాలని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, మోడీపై ఉన్న కేసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. వనౌటు పౌరసత్వం కోల్పోతే, మోడీకి భారత్‌కు తిరిగి వచ్చి విచారణ ఎదుర్కోవడం తప్పదన్నది స్పష్టమవుతోంది.
2010లో భారత్ విడిచి వెళ్లిన లలిత్ మోడీపై భారీ అవినీతి ఆరోపణలున్నాయి. ఈ పరిణామం తర్వాత మోడీ తదుపరి ప్లాన్ ఏమిటో వేచి చూడాలి.