తెలంగాణ: సీనియర్ నేత విజయశాంతి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో పార్టీ తనకు అవకాశం ఇచ్చినా ముందుగా పని చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ పని చేస్తూనే ఉన్నానని, కానీ పదవుల కోసం ఒత్తిడి తేవడం తన విధానం కాదని స్పష్టం చేశారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదింపడమే గతంలో తన లక్ష్యమని విజయశాంతి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు తాను తిరిగి కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు. పార్టీలో పదవులు రాకపోయినా క్రమశిక్షణగా కొనసాగాలని ఆమె పార్టీ నాయకులకు సూచించారు.
కాంగ్రెస్లో ఒక స్పష్టమైన విధానం ఉంటుందని, అందరూ ఆ నియమాల ప్రకారమే పనిచేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన ప్రాధాన్యమని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తోందని విజయశాంతి అన్నారు. ఈ మార్గంలో తాను పార్టీతో కలిసి ముందుకెళతానని స్పష్టం చేశారు.