హైదరాబాద్: భూ కబ్జాలు పెరిగిపోతున్నాయని ప్రజలు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదులు చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు రహదారులు, పార్కుల ఆక్రమణలపై ఆవేదన వ్యక్తం చేశారు.
మొత్తం 63 ఫిర్యాదులు నమోదు కాగా, తుర్కయాంజాల్, ప్రతాపసింగారం, బోడుప్పల్ ప్రాంతాల సమస్యలపై సంబంధిత అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొందరు మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు భూములను ఆక్రమిస్తున్నారని ప్రజలు ఆరోపించారు. ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. అక్రమ పత్రాలు సృష్టించి పాత లేఅవుట్లను మారుస్తున్నారని వివరించారు.
భూములు కబ్జా చేయడాన్ని అడ్డుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ అంశాలను పరిశీలించి, దర్యాప్తు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.