తిరుపతి: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, వైఎస్ జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, జగన్ హయాంలో రాష్ట్రం నాశనమైందని, అలాంటి వారిని జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.
ప్రజలు ఘోరంగా ఓడించినా, జగన్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుతున్న తీరు చిన్నపిల్లాడి చేష్టలలా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ అసెంబ్లీలో హాజరు కాకుండా, తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ మారాం చేస్తున్నారని నారాయణ విమర్శించారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి రాని జగన్కు ఎమ్మెల్యే పదవి అవసరమా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా కోసం చేస్తున్న ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే పదవిని గౌరవించాలని, అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయాలని నారాయణ సూచించారు. జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ భవిష్యత్తును పునరాలోచించాలని హితవు పలికారు.
ప్రజా సమస్యల కోసం అసెంబ్లీలో పోరాడాల్సిన జగన్, అసెంబ్లీకి దూరంగా ఉండడం ప్రజా ప్రతినిధిగా ఆయన నైతికతపై ప్రశ్నలెత్తిస్తున్నదని నారాయణ వ్యాఖ్యానించారు.