ఏపీ: జనసేన ఆవిర్భావ సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో వివిధ అంశాలపై గట్టి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరిచారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, డీఎంకే వాదనలను పేరు ప్రస్తావించకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
భారతదేశం భిన్న సంస్కృతులు, భిన్న భాషల సమ్మేళనమని పేర్కొన్న పవన్, త్రిభాషా విధానం అవసరమని అన్నారు. తమిళ పార్టీలు హిందీ భాషను వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. హిందీ భాష వద్దనుకుంటే, తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకూడదని, ఆ భాష మాట్లాడే ప్రజల నుండి ఆదాయం ఆశించకూడదని లాజికల్‌గా వ్యాఖ్యానించారు.
డీలిమిటేషన్ విషయంలో ఉత్తరాదిని, దక్షిణాదిని వేరుచేసే విధానం సరికాదని పవన్ అన్నారు. అసలు సమస్యను విస్మరిస్తూ, విభజన ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అనాగరికమని అన్నారు. భారత కరెన్సీ రూపాయి గుర్తు మార్చాలన్న డీఎంకే నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఏపీ, కర్ణాటకలు కూడా తమ కరెన్సీ గుర్తులు మార్చుకోవాలా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
ఈ అంశాలపై దక్షిణాది నేతలు సరైన ఆలోచన చేయాలని, దేశాన్ని విభజించకుండా ముందుకెళ్లాలని పవన్ సూచించారు. తాను ఎప్పుడూ ప్రాంతీయ అసమ్మతి కలిగించే విధానాలకు వ్యతిరేకమని, జాతీయ స్థాయిలో సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
మొత్తానికి, పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో తమిళనాడు పాలకుల విధానాలను ఏకిపారేస్తూనే, భారతదేశ సమగ్రత, భాషా విధానంపై తన అభిప్రాయాన్ని గట్టిగా వ్యక్తపరిచారు. జనసేన అజెండాలో ఈ అంశాలు కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.