అమరావతి: రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతమైన వైఎస్సార్ జిల్లా కోపర్తిలో ఏపీ ప్రభుత్వం ‘వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ)’ని ఏర్పాటు చేస్తోంది. సుమారు 500 ఎకరాల్లో ఈ క్లస్టర్ ఏర్పాటుకు అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈఎంసీ–2 విధానం కింద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలను ఆకర్షించేందుకు రూ.730.50 కోట్ల పెట్టుబడితో వైఎస్సార్ ఈఎంసీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికల్ వలవన్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. దీనికి కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలపడమే కాకుండా రూ.380.50 కోట్లు గ్రాంట్‌గా సమకూర్చనుంది. మిగిలిన రూ.350 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.
ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, మెడికల్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్, టెలికాం నెట్‌వర్కింగ్, కమ్యూనికేషన్, ఈ-మొబిలిటీ ఉత్పత్తుల తయారీకి చెందిన పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఏపీఐఐసీ ఈ ఈఎంసీని అభివృద్ధి చేయనుంది. ఈ క్లస్టర్ ద్వారా రూ.పదివేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
కోవిడ్–19 పరిస్థితుల తర్వాత చాలా విదేశీ కంపెనీలు భారత్‌లో తయారీ రంగ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందులో భాగంగా తైవాన్‌కు చెందిన రెండు మొబైల్ తయారీ కంపెనీలు రాష్ట్రంలో తమ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తిని తెలియజేశాయి. యాపిల్ ఫోన్ తయారుచేసే తైవాన్ సంస్థ పెగాట్రాన్ కూడా కోపర్తిలో యూనిట్ ఏర్పాటుకు ఆసక్తిని చూపిస్తున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు.
అలాగే యాపిల్, రెడ్‌మీ వంటి ఫోన్లను తయారుచేసే ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో మరో రెండు యూనిట్ల ఏర్పాటును కూడా పరిశీలిస్తోంది. ఇందులో ఒక యూనిట్‌ను కోపర్తి ఈఎంసీలో ఏర్పాటుచేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. వీటితో పాటు పలు దేశీయ కంపెనీలు కూడా తమ యూనిట్లను ఏర్పాటుచేయడానికి ఆసక్తి వ్యక్తపరుస్తున్నాయి.