గుజరాత్: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భారత్‌కు పర్యటనకు రానున్నారు. తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన ఆమె ఇటీవలే భూమికి సురక్షితంగా చేరుకున్నారు.
స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ ‘ఫ్రీడమ్’ క్యాప్సూల్ ద్వారా ఫ్లోరిడా సముద్రజలాల్లో ల్యాండ్ అయిన ఆమె, ప్రస్తుతం కుటుంబంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే భారత పర్యటనకు వచ్చే అవకాశముందని ఆమె బంధువులు వెల్లడించారు.
సునీతా విలియమ్స్ భూమికి చేరుకున్న వెంటనే, గుజరాత్‌లోని ఆమె పూర్వీకుల గ్రామం ఝూలాసన్‌లో సంబరాలు మొదలయ్యాయి. గ్రామస్తులు బాణసంచా కాల్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు కూడా ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నారు.
అంతేకాదు, సునీతా తన కుటుంబంతో కలిసి ఓ ప్రత్యేక వెకేషన్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆమెకు లేఖ రాస్తూ, “భారత దేశం మీ కోసం ఎదురు చూస్తోంది” అంటూ ప్రశంసించారు. అంతరిక్షంలో భారత జెండాను రెపరెపలాడించిన ఆమె, తన అనుభవాలను భారత ప్రజలతో పంచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకుంటూ, కుటుంబంతో సమయం గడుపుతున్నారు. అధికారికంగా పర్యటన వివరాలు ఇంకా ప్రకటించనప్పటికీ, సునీతా విలియమ్స్ భారత పర్యటనపై భారీ ఉత్సాహం నెలకొంది. త్వరలోనే ఆమె స్వగ్రామంలో ప్రజల్ని కలవబోతున్నట్లు సమాచారం.