న్యూఢిల్లీ : ప్రపంచంలోని అన్ని దేశాలతోపాటు భారత్‌లో కూడా మహమ్మారి కరోనా కేసులు ఎక్కువగానే నమోదవుతున్నప్పటికీ మన దేశంలోనే మరణాల రేటు చాలా తక్కువగా ఉంటున్నాయని, కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని చెప్పడంలో ఎలాంటి సందేహాలు లేవు.
అయితే ప్రభుత్వం కలిసి కట్టుగా తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల కరోనా మహమ్మారిని పటిష్టంగా ఎదుర్కొంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు అందరూ చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్లనే భారత్‌లో కరోనా మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోందా? సామాజిక, జీవపరమైన సంబంధాలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా?
ప్రపంచంలో చాలా దేశాలకన్నా భారత్‌లో కోవిడ్ మరణాలు ఎంత తక్కువగా ఉన్నాయంటే, మృతులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 23వ స్థానంలో నిలిచింది. భారత్‌లో నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో మరణాల సంఖ్య 1.87 శాతం ఉంది. ఈ విషయంలో మనకన్నా రష్యా, ఫిలిప్పీన్స్, కజికిస్థాన్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, ఖతార్ దేశాల్లో మృతుల సంఖ్య తక్కుగా ఉంది.
భారత్లో కరోనాకు గురైన 50 ఏళ్ల లోపు వయసు వారిలో మరణాలకంటే కోలుకున్నా వారి సంఖ్యే అధికం. 50 ఏళ్లకు పైన వయస్సు ఎలా పెరుగుతుందో మృతుల సంఖ్య అలా పెరుగుతుండగా, 50 లోపు వయస్కుల్లో వయస్సు ఎలా తగ్గుతుంటే మృతుల సంఖ్య అలా తగ్గుతూ వస్తోంది.
మరణాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో వృద్ధులే కాకుండా మధ్య వయస్కులు కూడా ఎక్కువ మందే కరోనా బారిన పడగా, భారత్‌లో మధ్య వయస్కులు, యువతరం ఎక్కువగా కరోనా బారిన పడింది. అంటే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారే భారత్‌లో ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. పైగా అమెరికా, యూరప్ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఊబకాయుల సంఖ్య కుడా చాలా తక్కువ.
ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడా అమలు చేయనంత కఠినంగా భారత్‌లో లాక్‌డౌన్ అమలు చేయడం వల్ల మొదట్లో కరోనా వైరస్‌ను బాగానే కట్టడి చేయగలిగామని, కానీ ఆ తర్వాత వలస కార్మికుల సమస్య తలెత్తడం వల్ల చివరిలో ఫలితం లేకుండా పోయిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.