హైదరాబాద్: మొన్న ఒక యువతి తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడినట్టు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. అందులో పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. ఆ జాబితాలో యాంకర్ ప్రదీప్ పేరు కూడా ఉండటం తో మీడియాలో ఈ వార్త బాగా స్ప్రెడ్ అయింది. ఈ ఆరోపణలపై ప్రదీప్ స్పందించి ఒక వీడియో రిలీజ్ చేసాడు. నిజానిజాలు తెలుసుకోకుండా..వాళ్లకు వాళ్లే నిర్దారణ చేసుకుని అదే నిజమనుకుని నా ఫోటోలను వాడుకుని నా పేరు మీద హెడ్డింగ్‌లు పెడుతూ ఆర్టికల్స్ చేయడం, పబ్లిష్ చేయడం ఇదంతా ఎంత దారుణమైంది అని ప్రదీప్ ఎమోషనల్ అయ్యాడు.
ఇది చాలా సున్నితమైన అంశం, ఇలాంటి టాపిక్‌లో ఈ అబ్బాయి పేరు ఎందుకు ఉంది అని కూడా ఎవ్వరూ ఆలోచించలేదు యాంకర్ ప్రదీప్ పేరు వినిపించగానే టపా టపా రాసేయడం, అవతలి వ్యక్తులు ఏ ఉద్దేశ్యంతో చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎవరు చెప్పించారు అనేది ఏది ఆలోచించకుండా పేరు వినపడగానే ట్రోల్ చేయడం, వార్తలు రాయడం, దారుణంగా తిట్టడం, అవతలి వారి కుటుంబంలో ఏం జరిగిందో మా కుటుంబానికి అలానే చేస్తామని అనడం ఎంత దారుణంమని ప్రదీప్ ప్రశ్నించాడు. ఓ వ్యక్తికి న్యాయం జరగడం కోసం ఇంకో వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తారా? నిజానిజాలు తెలుసుకోకుండా… టార్గెట్ చేసి సోషల్ ట్రోలింగ్ చేసేస్తారా? దాని మీద ఒకర్ని చూసి మరొకరు టపా టపా టైప్ చేసి ఫోటోలు పెట్టేసి న్యూస్ చేసేస్తే వ్యూస్ వస్తాయ్.. ఆ వ్యూస్ ఎందుకు పనికొస్తాయ్..ఏం జరుగుతుంది. అది మంచి పద్దతా? నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది కదా అని యాంకర్ ప్రదీప్ అన్నాడు
నిజం తెలిశే వారికి ఎదురుచూడకుండా ఒకర్ని మించి ఒకరు వాళ్లు అలా పెట్టారు, మనం ఇలా పెడదాం, ఇంకా వెరైటీ పెడదాం, డిక్లేర్ చేద్దాం అంటూ ఇలా చేస్తూ ఉంటే నిజం తెలిసే లోపల నాకు గానీ నా కుటుంబానికి గానీ ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అవుతారు,ఇది ఎంత మెంటల్ ట్రామానో తెలుసా? ఇది మానసిక మానభంగం చేస్తున్నట్టు. ఎంత దారుణమైన స్థితిలోకి తీసుకెళ్తున్నారో తెలుసా? అని ప్రదీప్ బాధపడ్డాడు.
అలాగే ఇకపై వీటిని ఆపండి, కొంచెం ఆలోచించి రాయండి. ఎదుటి వారు ఎంత బాధ పడతారో తెలుసుకొని రాయండి. వూరికే ఏది దొరికితే అది రాయకుండా నిజాలు బాధలేంటో తెలుసుకొని రాయండి అని చెప్పాడు. అలాగే తనపై ఆరోపణలు చేసిన వాళ్లందరిపైనా తాను యాక్షన్ తీసుకోబోతున్నట్టు ప్రకటించాడు.