తెలంగాణ: మంచు మనోజ్, విష్ణు మధ్య కుటుంబ కలహాలు మళ్లీ ముదిరాయి. నిన్న తన కారు పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్, ఈరోజు మోహన్‌బాబు నివాసం వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. తన పెంపుడు జంతువులు, వ్యక్తిగత వస్తువుల కోసమే వచ్చానని తెలిపారు.
ఇది ఆస్తి గొడవ కాదని మనోజ్ స్పష్టం చేశారు. తన జుట్టు విష్ణు చేతుల్లోకి ఇచ్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. డిసెంబరు నుంచి గొడవలు జరుగుతున్నా ఇప్పటి వరకు పోలీసులు ఒక్క ఛార్జ్‌షీట్ కూడా నమోదు చేయలేదని వాపోయారు.
ఈ నెల 1న పాప పుట్టినరోజు సందర్భంగా జయపుర వెళ్లిన తర్వాత విష్ణు అనుచరులు తన కారు తీసుకెళ్లారని, సెక్యూరిటీపై దాడి చేశారని ఆరోపించారు. పోలీసులకు అనేకసార్లు వివరించినా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
ఇప్పుడు తన ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు ఆర్డర్ కావాలంటూ పోలీసులు అడుగుతున్నారని మనోజ్ ఆరోపించారు. మోహన్‌బాబు అనుమతి లేకుండా లోపలికి అనుమతించమంటూ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
తన సమస్యకు పరిష్కారం కావాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనతో మోహన్‌బాబు కుటుంబం మరోసారి మీడియా దృష్టిని ఆకర్షించింది.