టాలీవుడ్: ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లో నిలదొక్కుకుంటున్న హీరో దగ్గరి నుంచి టాప్ స్టార్ల వరకి అందరూ రీమేక్ ల దారి పడుతున్నారు. రీమేక్ అంటే ఇది వరకే నిరూపితమైన సబ్జెక్టు. కానీ ఇదివరకే వచ్చింది కాబట్టి దానిని చూసే అభిమానులు కూడా ఎక్కువే ఉంటారు అన్న లాజిక్ ఎక్కడ మిస్ అవుతుందో అర్ధం కావట్లేదు. ఒకప్పుడు అంటే ఈ యూట్యూబ్ లు, ఓటీటీ లు, టోరెంట్స్ లేని రోజుల్లో రీమేక్ లు చేశారు, ఇక్కడి వాళ్ళకి అది కొత్త సబ్జెక్టు కాబట్టి కొత్త ఎక్స్పీరియన్స్ ఉండేది. ఇపుడు పరిసితులు వేరు. వేరే భాషలో ఒక హిట్ సినిమా అనగానే ఆ సినిమాకి నేషనల్ లెవెల్ లో హైప్ వస్తుంది, అలాగే ఆ సినిమా సబ్ టైటిల్స్ తో ఓటీటీల్లో ప్రత్యక్షమవుతుంది. అప్పటికీ చూడకపోయినా కూడా ఆ సినిమా ని రీమేక్ చేస్తున్నారు అనగానే దాని ఒరిజినల్ వెర్షన్ ని చూసేస్తున్నారు ప్రేక్షకులు. ఎంత లొకాలిటీ ఆడ్ చేసిన కూడా సినిమా మూల కథ అదే ఉంటది కాబట్టి ప్రేక్షకుడి మొదటి సారి చూస్తున్నా అనే థ్రిల్ ఐతే మిస్ అవుతుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో కుప్పలు కుప్పలుగా రీమేక్ లు సిద్ధం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’, రామ్ పోతినేని ‘రెడ్ ‘, విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’, కృష్ణ వంశీ ‘రంగ మార్తాండ’ ఇవి ప్రస్తుతం షూటింగ్ మధ్యలో ఉన్నవి, ముగింపు దశలో ఉన్నవి. ఇవే కాకుండా మెగా స్టార్ చిరంజీవి మలయాళం లో వచ్చిన ‘లూసిఫెర్’ రీమేక్ చేసే ప్లాన్ లో ఉన్నాడు, నితిన్ హిందీ లో సూపర్ హిట్ అయిన ‘అందాదున్ ‘ రీమేక్ ప్రారంభించాడు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా సినిమాలు రైట్స్ కొని హీరోలు ఖరారు కానీ సినిమాల లిస్ట్ ఇంకా చాలానే ఉంది. ఇవి ఒక రకంగా కొత్త టాలెంట్ ని తొక్కేయ్యడమే అవుతుంది. దర్శకుడు ఒక కొత్త కథతో వచ్చిన కూడా వాళ్ళకి ఈ హిట్ అయిన కథ ఇచ్చేసి తియ్యమనడం కూడా చాలా మంది దర్శకుల ఇంటర్వ్యూ లలో ఇదివరకే చాలానే విన్నాం. ఆశ్చర్య కరమైన విషయం ఏంటంటే కొత్తగా నిరూపించుకోవాల్సిన డైరెక్టర్స్ కూడా రీమేక్ ల బాట పట్టడం, ఇవి తగ్గినపుడు ఇండస్ట్రీ సక్సెస్ రేట్, కలెక్షన్స్ కూడా పెరుతుతాయి అనేది అక్షరాలా నిజం.
ఇప్పుడున్న టెక్నాలజీ ని దృష్టిలో ఉంచుకొని, పర బాషా సినిమాల రీచ్ ని ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ , హీరోస్ గుర్తించి ఎప్పుడైతే రీమేక్ సినిమాలు చెయ్యడం తగ్గిస్తారో అప్పుడే మన దగ్గరి నుండి కూడా అద్భుతమైన కథలు పుట్టుకొస్తాయి. ఇప్పటి వరకి రే-మేక్ లు ఎక్కువ చెయ్యని లేదా అసలే చెయ్యని హీరోల్లో మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ముందున్నారు. వాళ్ళ కెరీర్ గ్రాఫ్ లు కూడా అలానే దూసుకెళ్తున్నాయి.