న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిందనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఒక్క డ్రాగన్ ను మినహాయిస్తే ఇతర అగ్రరాజ్యాల పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు. భారత్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో –23.9 శాతం వృద్ధి నమోదు చేసిందన్న వార్త దేశంలో కొంత ఆందోళన కలిగించే విషయమే.
గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు ఏకంగా రుణాత్మకం కావడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. అయితే ఈ ఏడాది వృద్ధి కొంచెమేనా? అసలు ఉంటుందా? ఆగస్టు 31న విడుదలైన జీడీపీ అంకెలు ఆర్థిక వ్యవస్థ వాస్తవికతకు దర్పణమేనా? లేక.. భిన్నమైన కథ ఏదైనా దాగి ఉందా? అనేవి ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలు.
ఆగస్టు 31వ తేదీన విడుదలైన జీడీపీ అంకెల్లో జూలై నెల మొత్తాన్ని, ఆగస్టులో తొలి 15 రోజులను గణనలోకి తీసుకోలేదు. లాక్డౌన్ నిబంధనలను దశలవారీగా సడలించడం ప్రారంభమైన తరువాతి కాలంలో ఆర్థిక వ్యవస్థ మళ్లీ పరుగులు పెడుతోంది అనడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి.
అయితే ఇంకా లాక్‌డౌన్ నిబంధనలు కొన్ని కొనసాగుతూండటం వల్ల అంతా పూర్వపు యధాస్థితికి వచ్చిందనీ చెప్పలేని పరిస్థితి. ఐతే ఆర్థిక వ్యవస్థ నిలకడగా మళ్లీ పట్టాలెక్కుతోందనేది మాత్రం కళ్లముందు కనిపిస్తున్న దృశ్యం. కార్యాలయాల్లో ఉద్యోగుల రాకపోకలు మొదలుకొని, పార్కులు, రవాణా కేంద్రాల్లోనూ రద్దీ ఎక్కువ అవడం అన్‌లాక్ 3.0లో స్పష్టంగా కనిపించింది. జూలైలో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం మునుపటి ఏడాది అదే నెలతో పోలిస్తే 90 శాతానికి చేరుకుంది.
తయారీ రంగానికి సంబంధించి పర్చేజింగ్ మేనేజ్మెంట్ ఇండెక్స్ (పీఎంఐ) మే నెలలో 30.8గా ఉండగా జూలైలో 46కు ఎగబాకింది. అన్‌లాక్ 3.0, 4.0లతో పీఎంఐ మరింత ఎక్కువవుతుంది. ఆగస్టు నాటి పీఎంఐ 52గా నమోదుకావడం కూడా ఎంతో శుభసూచకం. ఇక విద్యుత్తు వినియోగం అనే సూచీని చూస్తే ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 2.64 శాతం పెరిగింది. ప్యాసెంజర్ వాహనాల అమ్మకాలు కూడా మార్చి తరువాత అత్యధిక స్థాయిలో నమోదవడం విశేషం. జూలై నెలలో బ్రాడ్ బ్యాండ్ వినియోగం కూడా ఎక్కువైంది.
ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికం తరువాతి నెల జూలైలో దేశవ్యాప్తంగా ట్రాక్టర్ల అమ్మకాలు 39 శాతం వరకూ పెరగడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి మంచి డిమాండ్ ఉందన్న విషయాన్ని వ్యక్తం చేస్తోంది. నైరుతీ రుతుపవనాలు కూడా సానుకూలంగా మారి వర్షాలు బాగా కురుస్తూండటం రానున్న మిగతా త్రైమాసికాల్లో వ్యవసాయ రంగం నుంచి ఆర్థిక వ్యవస్థకు మంచి ఊతం లభిస్తుందని అర్థం అవుతోంది.
ఎలక్ట్రానిక్స్ రంగంలో తయారీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్రత్యేక పథకం కారణంగా రానున్న ఐదేళ్లలో దేశంలో రూ.15 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు రావడానికి అవకాశం ఏర్పడింది. ఈ పెట్టుబడుల కారణంగా సుమారు 12 లక్షల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అంచనా.
ఆపిల్ ఫోన్లు తయారు చేసే రైజింగ్ స్టార్, విస్ట్రాన్, పెగట్రాన్ కంపెనీలతో పాటు ఇతర కంపెనీలైన శాంసంగ్, ఫాక్సా్కన్, హోన్ హాయి, వంటి మొత్తం 22 కంపెనీలు ఈ పథకంపై ఆసక్తి కనపరిచాయి. ఆపిల్ ఫోన్లు తయారు చేసే కంపెనీలు మూడూ ఇటీవలే భారత్‌లో ఐఫోన్–11 ఫోన్ల తయారీని కూడా చేపట్టాయి.