హైదరాబాద్: కరోనా వైరస్ ఇంకా విజృంభిస్తున్న నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. సుమారు 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటన నేపథ్యంలో సభను సజావుగా నిర్వహించేందుకు అసెంబ్లీ యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంది.
ప్రధానంగా శాసనసభ సమావేశ మందిరంలోనూ, బయటా భౌతిక దూరానికి ప్రాధాన్యతిస్తూ సభ్యులు, ఇతరుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి, స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులతో పాటు సభ్యులందరికీ పార్టీలకతీతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేశారు. దీంతో మూడు రోజులుగా అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మార్షల్స్, మీడియా ప్రతినిధులు, పోలీసులు, మంత్రుల పీఏలు, పీఎస్‌లు శాసనసభ ఆవరణలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
శాసనసభ, శాసన మండలిలో రెండు చోట్ల భౌతిక దూరానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సీటింగ్ ఏర్పాట్లు చేశారు. 119 మంది సభ్యులున్న శాసనసభలో 45, శాసన మండలిలో 40 మంది సభ్యుల కోసం ఎనిమిది సీట్లు అదనంగా ఏర్పాటు చేశారు. భౌతిక దూరం పాటిం చేలా విజిటర్స్ గ్యాలరీని మీడియా ప్రతినిధులకు కేటాయిస్తూ ఏర్పాట్లు చేశారు. శాసనసభ ఆవరణలో రద్దీని తగ్గించేందుకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వ్యక్తిగత సహాయకులకు అనుమతి నిరాకరించడంతో పాటు మీడియా, అధికారులకు జారీ చేసే పాస్‌ల సంఖ్యను కూడా భారీగా కుదించారు.
అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే సందర్భంగా తొలిరోజు జరిగే బీఏసీ భేటీలో సమావేశాల నిర్వహణ తీరుతెన్ను లపై స్పష్టత రానుంది. సభను ఎన్ని రోజులు నడపాలి, రోజుకు ఎన్ని గంటలు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చ జరగాలి అనే అంశాలపై బీఏసీలో చర్చ జరగనుంది. ప్రస్తుత సమావేశాల్లో అత్యంత కీలకమైన రెవెన్యూ చట్టంతో పాటు, మరో నాలుగు బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉంది. దివంగత మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ కూడా అసెంబ్లీలో తీర్మానం జరగనుంది.