న్యూఢిల్లీ: భారత చైనా సరిహద్దుల్లో తరచుగా ఉద్రిక్తతలు కల్పిస్తూ, భారత్‌ను కవ్విస్తున్న చైనా మరోసారి టెంపరితనం చూపింది. తూర్పు లద్దాఖ్‌లో ప్యాంగాంగ్ సరస్సు సరిహద్దుల్లో భారత దళాలకు హెచ్చరికగా గాలిలో కాల్పులు జరిపి దుస్సాహసానికి పాల్పడింది. సరిహద్దు ఘర్షణల సమయంలో కాల్పులకు పాల్పడకూడదన్న ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
1975 నాటి ఘర్షణల అనంతరం చైనా సరిహద్దుల్లో కాల్పుల ఘటన చోటు చేసుకోవడం ఇదే ప్రథమం. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) దళాలు గాలిలో కాల్పులు జరిపాయని, సరిహద్దుల్లోని భారత్ పోస్ట్‌ను స్వాధీనం చేసుకునేందుకు విఫల యత్నం చేశాయని మంగళవారం భారత సైన్యం ప్రకటించింది.
వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ను దాటి వచ్చి భారత దళాలే కాల్పులు జరిపాయన్న చైనా ఆరోపణలను ఖండించింది. ‘వాస్తవాధీన రేఖను భారత సైన్యం దాటి వెళ్లలేదు. కాల్పులు సహా ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడలేదు. భారత్, చైనాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను చైనా సైన్యమే యథేచ్ఛగా, ఏకపక్షంగా ఉల్లంఘిస్తూ దుందుడుకు చర్యలకు పాలుపడ్తోంది’ అని పేర్కొంది.
‘సెప్టెంబర్ 7వ తేదీన వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న భారత ఫార్వర్డ్ పోస్ట్‌ను చుట్టుముట్టి, స్వాధీనం చేసుకోవాలని చైనా ప్రయత్నించింది. భారత దళాలు ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నాయి. ఆ సమయంలో భారతీయ సైనికులను భయపెట్టేందుకు చైనా సైన్యం గాలిలో కొన్ని రౌండ్లు కాల్పులు జరిపింది’ అని భారత సైన్యం వివరించింది. ఉద్రిక్తతలను తగ్గించుకుని, శాంతి నెలకొనేందుకు భారత్ కట్టుబడి ఉన్నప్పటికీ, చైనా మాత్రం రెచ్చగొట్టే చర్యలను కొనసాగిస్తోందని ఆరోపించింది.
భారత సైన్యం వాస్తవాధీన రేఖను దాటి వచ్చి, చర్చల కోసం ముందుకు వస్తున్న చైనా సరిహద్దు గస్తీ దళాలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాయని సోమవారం రాత్రి చైనా సైన్యానికి చెందిన వెస్ట్రన్ థియేటర్ కమాండ్ అధికార ప్రతినిధి సీనియర్ కల్నల్ ఝాంగ్ షుయిలీ ఒక ప్రకటనలో ఆరోపించారు. దాంతో, పరిస్థితిని అదుపు చేసేందుకు చైనా సైనికులు ప్రతి చర్యలకు దిగాల్సి వచ్చిందన్నారు. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలో షెన్‌పావో పర్వత ప్రాంతంలో ఎల్‌ఏసీని భారత సైన్యం దాటి, చైనా భూభాగంలోకి వచ్చిందని ఆరోపించారు.
భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ చేశారని పేర్కొంటూ చైనా మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. ‘చైనా డైలీ, గ్లోబల్ టైమ్స్‌ల్లో అజిత్‌ధోవల్ చేశారని చెబుతూ కొన్ని వ్యాఖ్యలు ప్రచురించారు. అవి పూర్తిగా అసత్యాలు. అలాంటి ఊహాజనిత కథనాలకు దూరంగా ఉండాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.