అమరావతి: మూడు రాజధానులు అనేది ఒక సామాన్యుడి ఆలోచన. రాజధాని విధులను విభజించాం. విశాఖపట్నం నుంచి కార్యనిర్వాహక, అమరావతి నుంచి శాసన, కర్నూలు నుంచి న్యాయ వ్యవస్థ విధులు నిర్వహణ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ కూడా రాజధాని విధులు విభిన్న ప్రాంతాలకు కేటాయించవచ్చునని చెప్పింది. అన్ని విధులూ ఒకే చోట నుంచి ఎందుకు నిర్వహించాలి? చెన్నై, హైదరాబాద్ నగరాల్లో విధులన్నింటినీ కేంద్రీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు సార్లు తీవ్రంగా నష్ట పోయింది.
అన్ని గుడ్లూ ఒకే బుట్టలో ఉంటే నష్టపోతారని చరిత్ర చెబుతోంది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇంకా అదే వైఖరిని ఎందుకు కొనసాగించాలి? ఇది తార్కికమైన, హేతుబద్ధన ఆలోచన కానే కాదు. హైదరాబాద్‌లోని మాధాపూర్‌లో 1990 ప్రాంతంలో జరిగిన ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’ విధానమే మళ్లీ గత టీడీపీ పాలనలో అమరావతిలో జరిగింది.
సచివాలయం, అసెంబ్లీ లేదా హైకోర్టు అనేవి అభివృద్ధి కాక పోతే ఎందుకంతగా వాటి గురించి పట్టించుకోవాలి. వాటి గురించి మాట్లాడుకోవద్దు. రాజధాని నిర్మాణానికి రూ. లక్ష కోట్లు కావాలని గత ప్రభుత్వం చెప్పింది. రైతుల నుంచి సేకరించిన, సమీకరించిన 33000 ఎకరాల భూమిలో మెగా భవన నిర్మాణాలకు ఏ మాత్రం అనువుగా లేని చోట ఒక నగరాన్ని నిర్మించడం కన్నా ఆయన 500 ఎకరాల్లో మరొక చోట నిర్మాణానికి ప్రయత్నించి ఉండొచ్చు.
కేవలం ఒక వర్గానికి లాభం చేకూర్చడం కోసం గత ప్రభుత్వం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప మరొకటి కాదు. అభివృద్ధి అనేది ఒకే చోట కాకుండా దానిని వికేంద్రీకరించి రాష్ట్రమంతటికీ విస్తరింప జేస్తే అన్ని చోట్లా సమీప భవిష్యత్తులో గ్రోత్ సెంటర్లుగా విరాజిల్లుతాయి. ఉదాహరణకు కేరళ రాష్ట్రంలో ఎన్ని పెద్ద నగరాలున్నాయి? లేవే! అయినప్పటికీ ఆ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే అనేక ప్రామాణికాల్లో ముందంజలో ఉంది.
అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి విస్తరింప జేస్తే విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, తిరుపతి మరి కొన్ని నగరాలు అభివృద్ధి క్లస్టర్‌లు ఉంటాయి. పోర్టుల అభివృద్ధి కూడా జరుగుతోంది. వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న మధ్య కోస్తాలో అగ్రోలాజిస్టిక్ పార్కును కలిగి ఉండొచ్చు, అన్నీ కలిసి అభివృద్ధి దిశగా ముందుకు వెళతాయి.