వాషింగ్టన్: అమెరికా వాషింగ్టన్ పోస్ట్ ఎడిటర్, సీనియర్ పాత్రికేయుడు 77 ఏళ్ళ బాబ్ వుడ్‌వర్డ్ రాసిన ‘రేజ్’ ’పేరుతో ప్రచురించి విడుదల చేయనున్న పుస్తకంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసులో ఏముందో స్పష్టం గ తెలిసింది. సీనియర్ జర్నలిస్టు వుడ్‌వర్డ్ గత డిసెంబర్ నుంచి జూలై వరకు పలు సార్లు జరిపిన 18 ఇంటర్వ్యూల వివరాలను ఒక పుస్తకరూపంలో తీసుకొచ్చారు.
2018లో సింగపూర్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ని మొదటిసారి కలిసినప్పుడే తనని ఆకట్టుకున్నాడని, కిమ్ చాలా తెలివైన వ్యక్తి అనీ, ఆయన తనకి అన్ని విషయాలు చెప్పాడనీ, చివరకు ఆయన సొంత అంకుల్‌ని ఎలా చంపిన వైనాన్నీ గ్రాఫిక్స్‌లో తనకు వివరించాడని ట్రంప్ పేర్కొన్నట్టు పుస్తక రచయిత వెల్లడించారు.
ట్రంప్ కిమ్‌తో అణ్వాయుధాలపై జరిగిన చర్చలను కూడా ప్రస్తావిస్తూ, ఉత్తర కొరియా అణ్వాయుధాల తయారీని ఎప్పటికీ విడిచిపెట్టదని, ఈ విషయంలో అమెరికా ఇంటెలిజెన్స్ అధికారుల అంచనాలు తప్పని ట్రంప్ కొట్టిపారేశారు. ఉత్తర కొరియాని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో సీఐఏకీ తెలియదని ట్రంప్ చెప్పారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అవసరం లేని రేటింగ్ ఇచ్చారని ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశంలో గతంలో ఎప్పుడూ లేని అణ్వాయుధ వ్యవస్థని ఏర్పాటు చేశానని, అమెరికాకి ఉన్న రహస్య ఆయుధాలు ప్రపంచంలో మరెవ్వరికీ లేవని, ట్రంప్ చెప్పినట్లు ఈ పుస్తక రచయిత పేర్కొన్నారు.
కరోనా మహమ్మారిని తాను కావాలనే తక్కువ చేసి మాట్లాడిన విషయాన్ని అంగీకరించిన ట్రంప్, ప్రజలను భయభ్రాంతుకు గురిచేయడం ఇష్టంలేకనే తాను అలా మాట్లాడానన్నారు. సెప్టెంబర్ 15న ఈ పుస్తకం మార్కెట్‌లోకి విడుదల కానుంది.