fbpx
Monday, January 20, 2025
HomeAndhra Pradeshఆంధ్రాలో ప్రారంభం కానున్న రెండు అమూల్ డెయిరీ ప్లాంట్లు

ఆంధ్రాలో ప్రారంభం కానున్న రెండు అమూల్ డెయిరీ ప్లాంట్లు

AMUL-STARTS-TWO-PLANTS-IN-AP

అమరావతి: గుజరాత్ కు చెందిన పాల వ్యాపార కంపెనీ అమూల్‌ (ఆనంద్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌) ఇప్పుడు తన కార్యకలాపాలను అంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. మూడు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న ఆ సంస్థ గుజరాత్‌ నుంచి ఇక్కడి సహకార శాఖ అధికారులకు ఆన్‌లైన్‌లో శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించింది.

క్షేత్రస్థాయిలో పరిస్ధితులను అధ్యయనం చేసిన కంపెనీ మొదటగా కంకిపాడు, ఒంగోలులో డెయిరీ ప్లాంట్లను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. రైతులకు మంచి గిట్టుబాటు ధర, ఆన్‌లైన్‌లో చెల్లింపులు, పశువులకు నాణ్యమైన మేత, మరియు చికిత్స అందించేలా వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించింది.

అమూల్‌కు చెందిన సాంకేతిక బృందం సోమవారం నుంచి శనివారం వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పాడి పరిశ్రమ స్థితిగతులను అధ్యయనం చేసింది. ఈ బృందంలో అమూల్‌ జీఎం హిమాన్షు పి.రాథోడ్, పశు వైద్యులు, పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌ విభాగాలకు చెందిన 22 మంది నిపుణులు ఉన్నారు.

వీరంతా మూడు బృందాలుగా ఏర్పడ్డారు. మొదటి బృందం సాంకేతిక పరిస్థితులు, రెండో బృందం పాల సేకరణ, ధరలు, మూడో బృందం మార్కెటింగ్‌ పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసింది. సహకార డెయిరీ ప్లాంట్లలోని యంత్ర పరికరాలు, వాటి సామర్థ్యం, అక్కడి పరిస్థితులను పరిశీలించింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సహకార డెయిరీ, కంకిపాడులోని డెయిరీ ప్లాంట్లను వెంటనే వినియోగించుకునే అవకాశాలు ఉండటంతో మొదటిగా వాటిల్లో కార్యక్రమాలు ప్రారంభించాలని నిర్ణయించింది.

కృష్ణాజిల్లా కంకిపాడులోని డెయిరీ ప్లాంట్‌ నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సులభంగా రవాణా చేసే అవకాశాలు ఉన్నాయని గుర్తించి దీనిని వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలోని పాడి పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయి. అమూల్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఆ సంస్థకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తోంది. పాలను విక్రయించే మహిళా సభ్యులకు మంచి ధర వచ్చేలా చర్యలు, నగదు చెల్లింపులు, పశువులకు నాణ్యమైన దాణా, వైద్యం అందించడానికి అనువుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular