చెన్నై: తమిళ నటుడు సూర్య ‘నీట్’ పరీక్ష జరిపిన విధానం పై, ఆ పరీక్షా కారణంగా ఆత్మబలి చేసుకున్న విద్యార్థులపై సంఘీభావం తో చేసిన ప్రకటన పై సూర్య పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని మద్రాస్ హై కోర్టు కి వినతులు అందాయి. కరోనా పరిస్థితుల మధ్య ఈ పరీక్షలను రాయాల్సి వచ్చినందు వల్ల తీవ్ర ఒత్తిడికి గురైన ముగ్గురు తమిళవిద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సూర్య ఈ వ్యాఖ్యలు చేశారు.
కరోనా భయంతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా న్యాయం చేస్తున్నగౌరవనీయ న్యాయమూర్తులు విద్యార్థులను మాత్రం భయం లేకుండా నీట్ పరీక్షకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేయడం విడ్డూరమంటూ ఘాటుగా విమర్శించారు.ఇలాంటి పరీక్షలను ‘మనునీతి పరీక్షలు’లుగా అభివర్ణించిన సూర్య వీటివల్ల విద్యార్థుల జీవితాలను బలి తీసుకోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు. అంతేకాదు ఈ ఆత్మహత్యలు తల్లిదండ్రులకు జీవితకాల శిక్షగా మారతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, కోర్టులు క్రూరంగా వ్యవహరిస్తున్నాయంటూ ట్విటర్ లో ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ విషయం పై స్పందించిన నటుడు ప్రస్తుతం న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాడు. దేశంలోని న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను విమర్శించిన సూర్యపై కోర్టు ధిక్కార చర్యల తీసుకోవాలని కోరుతూ హైకోర్టు న్యాయమూర్తి ఎస్.ఎం.సుబ్రమణ్యం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.