చెన్నై: తమిళనాడులో గత కొన్నాళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వ పాఠశాలలపై ఏర్పడుతున్న నమ్మకం ఒక వైపు, ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల భారాన్ని తట్టుకోలేని నిస్సహాయత ఒక వైపు, వెరసి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి ముందుకు వస్తున్నారు.
దీనికి తోడు కరోనా నేపథ్యంలో భోధనాతీరూ కూడా పూర్తిగా మారి పోయింది. అయితే మారుమూల ప్రాంతాల్లో, అసలు టీవీలు, సెల్ఫోన్లు లేని కుటుంబాలు కూడా చాలా వరకు ఉన్నాయి. దీంతో వారికి సాయపడేందుకు ఓ అడుగు ముందుకేశారు లెక్కల టీచర్ కె. భార్గవి. ప్రభుత్వ టీవీ చానల్ ‘కల్వి తొలైకచి’ ద్వారా ఆన్లైన్ పాఠాలు చెప్పేవారు. అయితే ముఖ్యంగా పదో తరగతి విద్యార్థుల గురించి ఆమె మరింత శ్రద్ధ తీసుకుంది. ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా నేరుగా విద్యార్థులతో ముచ్చటించి వారిని గైడ్ చేస్తొంది.
అయితే తన తరగతి లోని చాలా మంది విద్యార్థులు ఆ గ్రూపులో లేరు. అసలు వీళ్లు పాఠాలు వింటున్నారా లేదా అని తెలుసుకోవడానికి టీచరమ్మ 80 కిలోమీటర్లు ప్రయాణించి మరీ ఆ విద్యార్థుల ఇళ్ళ వద్దకు చేరుకుంది. వారంతా నిరుపేద విద్యార్థులు. పూట గడవడమే కష్టమయ్యే పరిస్థితుల్లో ఇక స్మార్ట్ఫోన్లు కొని తరగతులకు హాజరవడం గగనమే.
సమస్య తెలుసుకొన్న టీచర్ ఎవరో వచ్చి సహాయం చేస్తారులే అని ఊరుకోకుండా టీచరమ్మే సాయం చేయడానికి ముందుకొచ్చింది. తను దాచుకున్న లక్ష రూపాయలతో 16 మంది పేద విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు కొనిచ్చింది. అంతే కాకుండా వాటికి సిమ్‌కార్డులు, రీచార్జ్ బాధ్యతలను కూడా తనే తీసుకుంది. స్కూళ్లు తిరిగి తెరిచి, విద్యార్ధులు వచ్చేవరకు వాటికి పూర్తి రీచార్జ్ తానే చేస్తానని హామీ కూడా ఇచ్చింది.
నా పిల్లలు పాఠాలు వినాలి, పరీక్షలు పాసవ్వాలి. అందుకే నావంతు చిన్న ప్రయత్నం అంటూ వెల్లడించింది. టీచరమ్మ మంచి మనస్సుకు అందరూ ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు.