ఢిల్లీ : భారత మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరు వింటేనే గుర్తుకు వచ్చే విషయాలలో మొట్ట మొదటిది 2007 టీ20 ప్రపంచకప్. సెప్టెంబర్ 19, 2007, ఈ తేదీ యూవీ కెరీర్లో మరుపురానిదిగా నిలిచిన రోజు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాది వీరవిహారం చేసినది ఈ రోజే. టీ20 మజా అంటే ఏంటో అభిమానులకు చూపించిన రోజు ఇది.
యువీకి కోపం వస్తే అవతలి బౌలర్ ఎవరు అనేది చూడకుండా సుడిగాలి తుఫాను అంటే ఏంటో చూపించిన రోజు, సరిగ్గా ఈరోజుతో ఆ విధ్వంసానికి 13 ఏళ్లు నిండాయి. మళ్లీ ఒకసారి ఆ మ్యాచ్ విశేషాలను గుర్తు చేసుకుందాం.
డర్బన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 16.4 ఓవర్లు ముగిసే సమయానికి 155/3తో నిలిచిన దశలో యువరాజ్ సింగ్ క్రీజులోకి వెళ్లాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన ప్లింటాఫ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ వరుసగా 4, 4 బాదగా.. ప్లింటాఫ్ నోరు జారాడు.
అప్పుడు మైదానంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరు కొట్టుకోవడానికి కూడా రెడీ అయ్యారు. అయితే అంపైర్లతో పాటు ఇరు జట్ల కెప్లెన్లు కల్పించుకొని సర్దిచెప్పారు. అయితే అప్పటికే కోపంతో ఊగిపోతున్న యూవీ తన కోపాన్ని మొత్తం తరువాతి ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన స్టువర్ట్ బ్రాడ్ మీద చూపించాడు.
ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6, 6, 6, 6 బాదిన యువరాజ్ సింగ్.. టీ20 వరల్డ్‌కప్‌లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. అలానే 12 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకోవడం ద్వారా టీ20ల్లో వేగంగా అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు.