ఒట్టావా : ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలతోపాటు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం లభించడం లేదు. దీంతో చెరువులు, కుంటలు, నదులు, సరస్సులు, సముద్ర జలాలు మొత్తం ప్యాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి.
పర్యావరణ పరిరక్షణకు ఐక్యరాజ్య సమితికి ఇచ్చిన హామీలన్నింటినీ ప్రపంచ దేశాలు నెరవేర్చినప్పటికీ 2030వ సంవత్సరం నాటికి ప్రపంచ జలాల్లో 5.30 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతాయని ఓ కెనడా బృందం అంచనా వేసింది. ఇది 2005 సంవత్సరం నాటి ప్లాస్టిక్ వ్యర్థాలకు ఏడింతలు ఎక్కువ. ప్రస్తుతం ప్రపంచ జలాల్లోకి ఏటా 2.40 నుంచి 3.40 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతున్నాయని అధ్యయనంలో తేలింది.
ప్లాస్టిక్ ఉత్పత్తులను తక్షణం సంపూర్ణంగా వాడడం ఆపేయడంతోపాటు, ప్లాస్టిక్ వ్యర్థాలను నూటికి నూరు శాతం రీసైక్లింగ్ చేయాలని, ప్లాస్టిక్ వాడకాన్ని క్రమంగా తగ్గించాలని అప్పుడే పరిస్థితి మెరగుపడుతుందని టొరాంటో యూనివర్శిటీకి చెందిన కన్జర్వేషన్ బయాలజిస్ట్ స్టీఫెనీ బొరెల్లీ హెచ్చరించారు. 2015లో ప్లాస్టిక్ వ్యర్థాల్తో 80 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు రీసైక్లింగ్‌కు పనికి రానివని తేలిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
సముద్ర తీర ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను ఏటా ఏరివేయడంలో ఎన్జీవో సంస్థల తరఫున కొన్ని లక్షల మంది కార్యకర్తలు పాల్గొంటున్నారని, 2030 నాటికి కనీసం వంద కోట్ల మంది కార్యకర్తలు వ్యర్థాల ఏరివేతలో పాల్గొంటే తప్పా పరిస్థితి మెరగుపడే అవకాశమే లేదని ఆమె హెచ్చరించారు.