అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లోని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాల అమలు తీరు, పాలనలో విప్లవాత్మక సంస్కరణలకు నాందిపలికిన గ్రామ సచివాలయ, వాలంటీర్ల శాఖను ఆయనకు కేటాయించింది. ఇక పై గ్రామ సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ల శాఖ పర్యవేక్షన ఆయన చేయనున్నారు.
అదే విధంగా వార్డు సచివాలయాలు, వాలంటీర్ల శాఖను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు కేటాయించింది. వార్డు సచివాళయం మరియు వాలంటీర్ల బాధ్యత ఇకపై బొత్స చూడనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 166 అధికరణలో గల క్లాజ్(3), ఏపీ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ఆరులోని సబ్ రూల్(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్, గ్రామ/వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు/ వార్డు సచివాలయాల శాఖకు సంబంధించి ఈ మేరకు శాఖలను కేటాయించినట్లు తెలిపింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది.
ఇప్పటికే 1.34 లక్షల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్వరాజ్యానికి నాంది పలికింది. ఈ సచివాలయాల వల్ల ప్రజలకు ఇంటివద్దకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. కాగా ఈ సచివాలయాలు ప్రారంభించి అక్టోబర్ 2వ తేదీకి సంవత్సరం కానుంది.